కోలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలెక్కబోతుంది. ఇటీవలే దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లి జరిగింది. దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఇప్పుడు మరో డైరెక్టర్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. కోలీవుడ్ లో ‘ఇరుంబుతిరై’ సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించారు పిఎస్ మిత్రన్. ఈ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సినిమా పెద్ద హిట్ అయింది.
ఇప్పుడు పిఎస్ మిత్రన్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఆశామీరా అయ్యప్పన్ తో ప్రేమలో పడ్డారు. ఈ ఇద్దరికీ జూన్ 24న నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిఎస్ మిత్రన్ తన సినిమాలతో ఎంతగా ఫేమస్ అయ్యారో.. వివాదాలతో కూడా అంతే ఫేమస్ అయ్యారు. ‘అభిమన్యుడు’ సినిమాకి సీక్వెల్ విషయంలో దర్శకుడు మిత్రన్, హీరో నిర్మాత అయిన విశాల్ మధ్య వివాదాలు తలెత్తాయి.
లండన్ షెడ్యూల్ విషయం, దాని బడ్జెట్ విషయంలో నిర్మాతకు, దర్శకుడికి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో మిత్రన్ ను ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారు విశాల్. ఆ తరువాత సినిమాను తానే దర్శకుడిగా పూర్తి చేశారు విశాల్. ఇంకా ఆ సినిమా రిలీజ్ కాలేదు. అయితే మిత్రన్ కూడా విశాల్ కు ఘాటుగానే బదులిచ్చారు. మిత్రన్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కార్తి హీరోగా ‘సర్ధార్’ సినిమా చేస్తున్నారు.
మరోపక్క తను ప్రేమించిన ఆశామీరా అయ్యప్పన్ తో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఆయన ఎంగేజ్మెంట్ పై కోలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. కార్తి కూడా ట్వీట్ వేసి కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్పారు. ఫిల్మ్ జర్నలిస్ట్ గా పని చేస్తోన్న ఆశామీరా ట్విట్టర్ వేదికగా తన నిశ్చితార్ధం గురించి ప్రకటించి.. ఇంత ప్రేమ కురిపిస్తున్న అందరికీ థాంక్స్ చెప్పింది.