గాడ్ ఆఫ్ వార్.. ఈ సినిమా ఎవరు చేస్తారు అంటూ.. గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. కుర్చీలా ఆడినట్లుగా సినిమా అల్లు అర్జున్ నుండి ఎన్టీఆర్‌కి.. ఎన్టీఆర్ నుండి అల్లు అర్జున్‌కి తిరిగి తిరిగి ఫైనల్‌గా ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. ఇటీవల ఈ సినిమాను ఘనంగా ప్రకటించారు కూడా. అయితే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం మాత్రం చెప్పలేదు. త్వరలో ఈ విషయంలోనూ క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. ఈ సినిమా ప్రారంభాన్ని భారీ స్థాయిలో చేయాలని ఫిక్స్ అయ్యరట.
ఈ సినిమా గురించి ఇంకా గొప్పగా చెప్పుకునే రోజులు త్వరలో రానున్నాయి అని ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్న సమయంలో ఊహించని ప్రకటన కోలీవుడ్ నుండి వచ్చేసింది. ‘తమిళ మురుగన్’ టైటిల్‌తో ధనుష్ హీరోగా వెట్రిమారన్ ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా 2029లో పట్టాలెక్కుతుంది అని ప్రకటించేశారు. ప్రస్తుతం ధనుష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.. అవన్నీ అయ్యాక వెట్రమారన్ సినిమా ఉండబోతోంది. కాబట్టి.. ఈ సినిమాతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాకు ఇబ్బంది అయితే లేదు.
కానీ, తెలుగులో సుబ్రహ్మణ్య స్వామి మీద ఓ సినిమా రూపొందుతుండటం, ఆ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అవుతుంది అని తెలిసినా.. మరో సినిమా ఎందుకు అదే కథతో అనేదే ఇక్కడ ప్రశ్న. సుబ్రహ్మణ్య స్వామి ఉత్తరాదికి చెందిన దేవుడు అంటూ ఎన్టీఆర్ సినిమా నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తమిళ తంబీలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇలా తమిళ పరిశ్రమ నుండి ఓ సినిమా అనౌన్స్ అవ్వడం ఆస్తక్తికరమే.
అన్నట్లు ‘సెయాన్’ పేరుతో శివకార్తికేయన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలోనే ఆ సినిమా ఉండనుంది. ఆ లెక్కన ‘తమిళ మురుగన్’ సినిమా చాలా ప్రశ్నలే లేవనెత్తుతోంది. అలాగే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఎప్పుడొస్తుంది అనేది కూడా కీలకాంశమే.