సినిమా షూటింగ్ సమయంలో మనం ప్లాన్ చేసినవే కాదు.. అనుకోనివి కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో చాలామంది సమయస్ఫూర్తితో స్పందిస్తుంటారు. మరికొంతమంది పారిపోతుంటారు. అలా యూనిట్ సభ్యులతో పాటు హీరో హీరోయిన్స్ పారిపోయిన సందర్భం చెన్నైలో జరిగింది. యువ దర్శకుడు వసంత బాలన్ దర్శత్వంలో జైల్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అబర్నతి, జివి ప్రకాష్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల్ని చెన్నైలోని కన్నంగి నగర్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు ఊహించని సంఘటన ఎదురైంది. షూటింగ్ చేస్తున్న సమయంలో కొందరు వేట కొడవల్లతో అటుగా దూసుకు వచ్చారట.
దాంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా షాక్ అయ్యి పరుగెత్తారు. కన్నంగి నగర్ ప్రాంతానికి రౌడీ ఏరియా అనే పేరు ఉంది. ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అయినా కథ నిమిత్తం అక్కడే షూట్ ప్లాన్ చేశారు. షూటింగ్ సమయంలోనే నిజమైన గొడవ జరగడంతో హీరో హీరోయిన్ షూటింగ్ స్పాట్ నుంచి కొంత దూరం పారిపోయి అక్కడ ఒక చిన్న ఇంట్లో దాక్కున్నారు. దాదాపు రెండు గంటల తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు అంతా స్పాట్ కి చేరుకొని హీరోకు కాల్ చేయడంతో వచ్చి షూటింగ్లో పాల్గొన్నారు. ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.