కెరీర్‌లో వందో సినిమా అంటే చాలా స్పెషల్. అందుకే హీరోలు ఆ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉండాలి అని కోరుకుంటారు. నాగార్జున నుండి కూడా అభిమానులు అదే ఆశిస్తున్నారు. ఆయన ఆ సినిమాను వాయిదా వేస్తూ, ప్రాజెక్టు కాంబినేషన్ మారుస్తూ వస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి ఇంత సమస్యనా అని ఫ్యాన్స్ అనుకున్నారు. ఫైనల్‌గా ఇటీవల సినిమాను రా.కార్తిక్ దర్శకత్వంలో అనౌన్స్ చేసి షూటింగ్ ప్రారంభించాడు నాగ్. అయితే ఇప్పుడు మళ్లీ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
వచ్చే ఏడాది సంక్రాంతికి ‘సోగ్గాళ్లు వస్తున్నారు’ అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ఇటీవల ఓ ప్రకటన చేసింది. అందులో పెద్ద సమాచారం ఇవ్వలేదు కానీ.. ఆ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ సినిమాలకు సీక్వెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రావడంతో రా.కార్తిక్ సినిమా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది. ఆ సినిమా వందో సినిమా అని చెప్పారు. ఇప్పుడు అన్ని హంగులు, కుటుంబ బలంతో వస్తున్న సినిమాను 101వ సినిమాగా చెబుతారా? వందో సినిమా కోసమే కదా ఇలాంటి హంగులు పెడతారు అనే చర్చ రావడమే కారణం.
అయితే రా.కార్తిక్ సినిమా ఆగిపోయింది అని చెప్పలేం కానీ.. ఆ సినిమాను 101వ సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు అని అంటున్నారు. ఈ సీక్వెల్ కోసం దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో వర్క్ చేస్తున్నారని ఇటీవల మన ‘ఫిల్మీ ఫోకస్’లోనే మీరు చదివి ఉంటారు. ఇప్పుడు అదే నిజమై సినిమా అనౌన్స్‌మెంట్ జరుగుతోంది. ఆ రోజున సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అని చెబుతున్నారు.
సినిమా ప్రకటనలో ‘వాసివాడి తస్సాదియ్యా’ అంటూ టీజ్ చేయడంతో అదే సినిమా టైటిలా అనే డౌట్ వస్తోంది. ఆ విషయం తేలకపోయినా.. జనవరి 15న వస్తాం అని అయితే కచ్చితంగా చెప్పేశారు.