ఎన్టీఆర్ ‘దేవర’ తో హిట్టు కొట్టి ఫాంలోకి వచ్చిన డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva).. ప్రస్తుతం ‘దేవర 2’ పై ఫోకస్ పెట్టాడు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాకి కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంది. తారక్ లైనప్‌లో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు ఉండటంతో ‘దేవర 2’ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. పోనీ ఈ గ్యాప్‌లో వేరే స్టార్ హీరోలతో సినిమా చేద్దామంటే.. అగ్ర హీరోలందరి కాల్ షీట్స్ ఏవీ ఖాళీగా లేవు. ఇలా బడా హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తూ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేని కొరటాల సడెన్‌గా రూటు మార్చారు. మెగాఫోన్ పక్కనపెట్టి నిర్మాణం పై దృష్టి పెట్టాడు.స్టార్ డైరెక్టర్స్ పేర్లు సమర్పణలో వేస్తే.. హీరోల కాల్షీట్స్ దొరుకుతాయి. అలాగే ఓటీటీ వంటి బిజినెస్ ..లు కూడా బాగా జరుగుతాయి. ప్రస్తుతం కొరటాల అదే పనిలో పడ్డారని తెలుస్తోంది.
‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్‌పై వరుస చిత్రాలు నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే యువ దర్శకులు, రచయితలతో కథా చర్చలు మొదలుపెట్టారు. శివ నిర్వాణ, అజయ్ భూపతి, వెంకీ కుడుముల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లకు కొరటాల ఇప్పటికే అడ్వాన్సులు కూడా ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. తాను మళ్లీ మెగాఫోన్ పట్టుకునేలోపు, నిర్మాతగా రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ఆయన మాస్టర్ ప్లాన్.
ఇందులో భాగంగానే విశ్వక్ సేన్‌తో ఆయన ఓ ప్రాజెక్ట్ లాక్ చేశారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి హీరో, డైరెక్టర్‌కు స్క్రిప్ట్ అందజేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఇందులో నటించే హీరోయిన్ ఎవరనేది మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
మరోవైపు విశ్వక్ సేన్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ కోసం త్వరలోనే 20 రోజుల పాటు థాయ్‌లాండ్ వెళ్లనున్నాడు. ఆ షెడ్యూల్ పూర్తవ్వగానే, ‘లెగసీ’ చివరి దశ చిత్రీకరణలో జాయిన్ అవుతాడు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటే కొరటాల సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని విశ్వక్ భావిస్తున్నాడు.