Mahesh Babu: బర్త్‌డే సందర్భంగా అభిమానులకు సూపర్‌స్టార్‌ స్పెషల్‌ మెసేజ్‌!

అభిమాన కథానాయకుడు చెబితే… అభిమానులు తప్పక ఆచరిస్తుంటారు. మన దగ్గర ఇలాంటి అభిమానులు కోకొల్లలు. తాజాగా మరోసారి ఈ మాటను నిజం చేయాల్సిన అవసరం మహేష్‌బాబు అభిమానులకు ఎంతైనా ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను ఉద్దేశించి సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ప్రకృతి, సమాజం గురించి ఆలోచిస్తూ మహేష్‌ ఆ పోస్టులో ఆసక్తికర విషయం రాసుకొచ్చాడు.

‘నాపై అభిమానాన్ని చూపించడానికి భారీ ఏర్పాట్లు అవసరం లేదు. ఓ చిన్న పనికి నాంది పలికితే చాలు’ అంటూ మహేష్‌బాబు పిలుపునిచ్చాడు. ఆగస్టు 9న మహేష్‌బాబు పుట్టినరోజనే విషయం తెలిసిందే. దానిని పురస్కరించుకుని ప్రతి అభిమాని మూడు మొక్కలు నాటాలని మహేష్‌ కోరాడు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన ‘గ్రీన్‌ ఇండియా’ ఛాలెంజ్‌లో భాగంగా ఈ మంచి పనికి ముందుకు రండి అని మహేష్‌ కోరాడు.

అంతేకాదు మీరు నాటిన మొక్కల ఫొటోలను నన్ను ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగలరు. అలా నేను కూడా మీ మంచి పనిని చూడగలను అంటూ మహేష్‌ తన అభిమానులకు సూచించాడు. ఫేవరేట్‌ హీరో పుట్టిన రోజు నాడు ‘హ్యాపీ బర్త్‌డే మై హీరో’ అంటూ ట్వీట్లు చేసి ట్రెండింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతుంటారు. ఈ క్రమంలో ఓ మొక్క కూడా నాటేసి ఆ ఫొటో పెట్టేయండి అనేది మహేష్‌ కోరిక. చూద్దాం అభిమానులు ఎలా స్పందిస్తారో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus