సెట్స్.. హంగామా.. అనగానే తెలుగు ప్రేక్షకులకు చప్పున గుర్తొచ్చేది దర్శకుడు గుణశేఖర్. ‘బాహుబలి’ రూపేణా ఆయన పేరు కాస్త వెనక్కి వెళ్ళిందనుకోండి. అయితే ప్రస్తుత విషయం ఆయన గురించి కాదు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం-మహేశ్ బాబు కలయికలో ఓ సినిమా రావాల్సి ఉంది. క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనుకున్న ఈ సినిమా అంతలోనే నీరుగారిపోయింది. దీనికి గల కారణాలేమిటన్నది నిన్నమొన్నటి వరకు మిస్టరీ గానే మిగలగా తాజాగా ఆ వివరాలు బయటికొచ్చాయి.
ప్రముఖ రచయిత జయ మోహన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “కథ ప్రకారం ప్రముఖ దేవాలయాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. తమిళనాడులో అటువంటివి ఎన్నున్నా అందులో చిత్రీకరణకు అనుమతి లేదు. సెట్స్ వేయించాలనుకోగా అందుకు సుమారు రూ. 50 కోట్లు అవుతుందని లెక్క తేలింది. దాంతో ఇది అయ్యే పని కాదని వెనక్కి తగ్గిపోయారట లెజెండరీ డైరక్టర్. నిజానికిది మణిరత్నం కలల చిత్రంగా చెప్పుకుంటారు. మహేశ్ తోపాటు తమిళ స్టార్ హీరో విజయ్, విశాల్, అనుష్క తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాల్సి ఉంది. స్టార్ హీరోలతో అంటే దక్షిణాదిన 50, 60 కోట్ల వరకు పెట్టే నిర్మాతలున్నారు కానీ కేవలం సెట్స్ కే అంటే కష్టం. రోబో, బాహుబలి వంటి సినిమాలకి ఈ లెక్కలు అతీతం. అయితే లైకా ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలు ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు ముందుకొస్తున్నాయి. గనక ఎప్పటికైనా ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.