మంచు వారి ఫ్యామిలీ గొడవలు ఇంకా చల్లారినట్టు లేవు. గతేడాది మనోజ్ వర్సెస్ విష్ణు హడావిడి నడిచిన సంగతి తెలిసిందే. తనకు దక్కాల్సిన ఆస్తులని విష్ణు అక్రమంగా స్వాధీనపరుచుకుంటున్నాడని, తండ్రి మోహన్ బాబు కూడా తనకు అన్యాయం చేస్తున్నాడని, అలాగే శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల విషయంలో కూడా ప్రజలను మోసం చేస్తున్నారంటూ మంచు మనోజ్(Manchu Manoj) మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అక్కడితో అయిపోలేదు.. తనని ఇంటికి కూడా రానివ్వడం లేదని, తన పాపను కూడా దగ్గరకి తీసుకోనివ్వడం లేదని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అటు తర్వాత మీడియా వాళ్ళు మోహన్ బాబు ఇంటికి వెళ్లి నిలదీయగా.. మైక్ తో జర్నలిస్ట్ పై దాడి చేయడం, అటు తర్వాత క్షమాపణలు చెప్పుకోవడం.
అదంతా అయిపోయాక మనోజ్ ఇంట్లో బర్త్ డే పార్టీ జరుగుతుంటే.. అక్కడికి మంచు విష్ణు వెళ్లి జెనరేటర్లో పంచదార పోయడం అనేది తెగ ట్రెండ్ అయ్యింది.ఇక సోషల్ మీడియాలో మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ మనోజ్ పెట్టిన వీడియోలు, పోస్టులు కూడా ట్రోల్ స్టఫ్ అయ్యాయి. మధ్య మధ్యలో ‘కన్నప్ప’ సినిమాని కూడా టార్గెట్ చేశాడు మనోజ్. అయితే అటు తర్వాత మనోజ్.. విష్ణు సైలెంట్ అయ్యారు. దీంతో గొడవలు సర్దుమణిగినట్టే అని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే.. ఇప్పుడు మనోజ్ తన పంధా మార్చి మోహన్ బాబుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. నిన్న ప్రెస్ మీట్లో పాల్గొన్న మంచు మనోజ్.. ‘మీ ఫ్యామిలీలో మనస్పర్థలు క్లియర్ అయినట్టేనా?’ అంటూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి .. ‘ఎవరిని అడగాలో తెలుసు కదా.. వెళ్లి అడగండి.. కానీ మైక్ పట్టుకెళ్ళకుండా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి’ అంటూ మోహన్ బాబు పై సెటైర్ విసిరాడు.
మరోవైపు తన నెక్స్ట్ సినిమా ‘వడ్డీ కాసులవాడా’ అనౌన్స్మెంట్ వీడియోలో కూడా మోహన్ బాబు పై సెటైర్లు ఉన్నాయి. ఇవన్నీ మోహన్ బాబు, విష్ణు..లని గిల్లేలానే ఉన్నాయి అనడంలో సందేహం లేదు.