నిన్న, మొన్న ఏం జరిగిందో మరచిపోయి మాట్లాడితే.. రేపు నానా మాటలు పడాల్సి వస్తుంది. అప్పుడు నన్ను అంటున్నారు, నేనేం తప్పు చేశాను అంటూ బాధపడినా ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు ‘నేనేం చేశాను’ అని బయటకు అనడం లేదు కానీ.. పరిస్థితి మాత్రం అలానే ఉంది సిద్ధార్థ్‌కి. ఏమైందో ఏమో కానీ ఆయన కొన్నేళ్లుగా మన సినిమాల గురించి ఏదేదో మాట్లాడి వార్తల్లో నిలుస్తుంటాడు. దానికి నెటిజన్లు ఆన్సర్లు ఇచ్చి మరికొన్ని రోజులు ఆయన్ని వార్తలో పెడతారు.
కమర్షిల్ సినిమాలే ఎప్పుడూ చేయలేదు, అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలంటే తనకు తెలియదు అనేలా సిద్ధార్థ్ మాట్లాడుతూ ఉంటాడు. ఒకప్పుడు తెలుగులో స్టార్ హోదా అనుభవించి.. ఆ తర్వాత తమిళంలోనే సినిమాలు చేసుకుంటున్న సిద్దార్థ్‌కు (Siddharth) సరైన విజయం వచ్చి చాలా ఏళ్లు అయింది. మధ్య మధ్యలో ఒకట్రెండు సినిమాలు మోస్తరు విజయాన్ని అందించాయి. ఈ కారణమో ఏమో కానీ ఆయన కమర్షియల్ మీద, ఆ సినిమాలు చేసే వాళ్ల మీద కౌంటర్లు వేస్తుంటారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ్.. తను పెద్ద స్టార్ హీరో కాకపోవడానికి హీరోయిన్ల నడుము గిల్లే సీన్లు, వాళ్లను చెంపదెబ్బ కొట్టే సీన్లు, వాళ్లను కించపరిచే సీన్స్ చేయకపోవడమే అని అన్నారు. అలాంటి సన్నివేశాలు ఉండడం వల్ల చాలా సినిమాలు రిజెక్ట్ చేశానని కూడా చెప్పాడు. ఆయన చెప్పిన విషయంలో నిజం ఉందా లేదా అనేది ఆయన గత సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. కానీ ఆ విషయం ఆయన మరచిపోయి మాట్లాడుతున్నాడు.
సిద్ధార్థ్ (Siddarth) సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్‌ను ఎలివేట్ చేసిన సీన్స్, పాటలు చాలానే ఉన్నాయి. ఆయనకు మంచి విజయం అందించిన ‘ఆట’ (Aata) సినిమానే తీసుకొండి. ఆ సినిమాను ఇలియానా (Ileana) గ్లామర్, ఫిగర్ మీదనే నడిపించారు. ఆ సినిమాలో రొమాంటిక్ సాంగ్స్ ఇప్పటికీ కుర్రాళ్లకు ఫేవరెట్. ఇక ‘గృహం’ (Gruham) సినిమాలో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ సిద్ధార్థ్ చాలా కన్వీనియంట్‌గా మరచిపోయి మాట్లాడి ఇప్పుడు కౌంటర్లు వేయించుకుంటున్నాడు.