Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • తిరువీర్ (Hero)
  • ఐశ్వర్య రాజేష్ (Heroine)
  • మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్ (మ్యాడ్ ఫేమ్), ఝాన్సీ, ఆమని, ఆనందకోట జయరామ్ (Cast)
  • భరత్ దర్శన్ (Director)
  • మహేశ్వర రెడ్డి మూలి (Producer)
  • భరత్ మంచిరాజు (Music)
  • CH కుషేందర్ (Cinematography)
  • శ్రీ వరప్రసాద్ (Editor)
  • Release Date : 17th జూలై 2026
  • గంగా ఎంటర్టైన్మెంట్స్ (Banner)

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది ఐశ్వ‌ర్య రాజేష్‌ (Aishwarya Rajesh). ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌ర్వాత కొంత గ్యాప్ అనంత‌రం ఓ సుకుమారితో (Oh Sukumari) తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తీరువీర్ (Thiruveer) హీరోగా న‌టించిన ఈ సినిమాకు భ‌ర‌త్ ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు మ‌హేశ్వ‌ర్ రెడ్డి మూలి నిర్మించారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఓ సుకుమారి ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో ఐశ్వ‌ర్య రాజేష్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? ఆమెకు మ‌రో హిట్టు ద‌క్కిందా? అంటే?

Oh Sukumari Movie Review

క‌థ‌: దామిని (Aishwarya Rajesh) ముట్టుకుంటే క‌రెంట్ షాక్ వ‌చ్చే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంది. ఆమె కార‌ణంగా చంద్లాపూర్ ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. న‌రాల యాద‌గిరి (Thiruveer) స‌ర్పంచ్‌గా గెల‌వాల‌ని ఆశ‌ప‌డుతుంటాడు. అదే టైమ్‌లో అత‌డి తాత రాసిన ఓ వీలునామా బ‌య‌ట‌ప‌డుతుంది. యాద‌గిరితో పాటు అత‌డి చిన్నాన్న కొడుకు స‌ప్త‌గిరిలో (శ్రీనివాస్ గ‌విరెడ్డి) ఎవ‌రికి ముందుగా మ‌గ పిల్లాడు పుడుతే వారికి ఎన‌భై ఎక‌రాల ఆస్తి ద‌క్కుతుంద‌నే నిజం తెలుస్తుంది. ఆస్తి ఆశ‌లో ఉన్న యాద‌గిరి…దామినితో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు.

దామిని గురించిన నిజాన్ని దాచిపెట్టి ఊరివాళ్లంతా క‌లిసి యాద‌గిరితో ఆమె పెళ్లి జ‌రిపిస్తారు. శోభ‌నం రోజే దామినికి ఉన్న క‌రెంట్ షాక్‌ స‌మ‌స్య గురించి యాద‌గిరి తెలుస్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది? ప‌్రాణంగా ప్రేమించిన దామినిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మ‌ని యాద‌గిరి ఎందుకు చెప్పాడు? అస‌లు క‌రెంట్ షాక్ స‌మ‌స్య దామినికి ఎందుకొచ్చింది? త‌న మంచిత‌నంతో యాద‌గిరి కుటుంబ‌స‌భ్యుల్లో దామిని ఎలా మార్పు తెచ్చింది? చివ‌ర‌కు దామిని స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికిందా? దామిని గొప్ప మ‌న‌సును చంద్లాపూర్ ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: ఓ సుకుమారి (Oh Sukumari) మూవీకి ఐశ్వ‌ర్య రాజేష్ వ‌న్ ఉమెన్ షోగా నిలిచింది. దామిని పాత్ర‌లో కామెడీ, ఎమోష‌న్స్‌, సెంటిమెంట్ అన్నింటిని పండించింది. త‌న వ‌ర‌కు బాగా చేసింది. యాద‌గిరిగా తిరువీర్ నాచుర‌ల్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. భార్య కార‌ణంగా ఇబ్బందులు ప‌డే భ‌ర్త‌గా అత‌డిపై వ‌చ్చే కొన్ని ఫ‌న్‌ సీన్స్ బాగున్నాయి. ఝాన్సీ, ముర‌ళీధ‌ర్ గౌడ్ కామెడీ ట్రాక్ న‌వ్వించ‌క‌పోగా చిరాకును తెప్పించింది. అంజిమామ మ‌గ‌ధీర డైలాగ్స్ రిలీఫ్‌నిచ్చాయి. రూప‌ల‌క్ష్మి, ఆనంద్‌, శ్రీనివాస్ గ‌విరెడ్డి, జీవ‌న్‌తో పాటు చాలా మందే యాక్ట‌ర్లు ఈ సినిమాలో క‌నిపిస్తారు. ద‌ర్శ‌కుడి రాత‌లోని లోపాల కార‌ణంగా ఏ పాత్ర పెద్ద‌గా ఇంపాక్ట్ చూపించ‌దు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: ముట్టుకుంటే క‌రెంట్ షాక్ అనే ఐడియా కొత్త‌గా ఉంది. కానీ దానిని స్క్రీన్‌పై తీసుకురావ‌డంలోనే ద‌ర్శ‌కుడు త‌బ‌డిపోయాడు. రాత‌లో ఉన్న క్రియేటివిటీ తీత‌లో పూర్తిగా మిస్స‌య్యింది. భ‌ర‌త్ మంచిరాజు మ్యూజిక్ సూప‌ర్‌. సంగీతానికి స‌రిప‌డా క‌థ‌, సీన్లు లేక‌పోవ‌డంతో అత‌డి శ్ర‌మ వృథాగానే మారింది. సినిమాటోగ్ర‌ఫీ గురించి చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా ఏం లేదు. నిర్మాణ విలువ‌లు కూడా మోస్తారుగానే ఉన్నాయి. సినిమా ర‌న్‌టైమ్ రెండు గంట‌ల ప‌దిహేడు నిమిషాలే. కానీ మూడు గంట‌ల‌పైనే ఉన్న‌ట్లుగా అనిపిస్తుంది.

విశ్లేష‌ణ‌: హీరోకు ఓ స‌మ‌స్య ఉండ‌టం, దానిని దాచిపెట్టి క్ర‌మంలో ఎదుర‌య్యే క‌న్ఫ్యూజ‌న్లు, అత‌డి ప్రేమ‌కు ఎదుర‌య్యే అడ్డంకుల‌తో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడుతో పాటు తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. ఓ సుకుమారి కూడా ఇంచుమించు ఇదే పాయింట్‌తో సాగుతుంది. ఇందులో హీరోకు కాకుండా హీరోయిన్‌కు స‌మ‌స్య ఉన్న‌ట్లుగా చూపించారు. అది త‌ప్ప మిగిలిన‌దంతా సేమ్ టూ సేమ్‌.

స‌మ‌స్య‌ను చూపించ‌డ‌మే కాకుండా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ, ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ అయ్యాయి కాబ‌ట్టే భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు హిట్ట‌య్యాయి. ఓ సుకుమారికి అదే మైన‌స్‌గా మారింది. హీరోయిన్‌కు ముట్టుకుంటే క‌రెంట్ షాక్ త‌గ‌ల‌డం, అది తెలియ‌కుండా హీరో పెళ్లి చేసుకోవ‌డం వ‌ర‌కు ద‌ర్శ‌కుడు సినిమాను బాగానే న‌డిపించాడు. అస‌లైన క‌థ‌లోకి ఎంట‌ర‌య్యే టైమ్‌లో ట్రాక్ త‌ప్పాడు. ఎలెక్ష‌న్స్ , ఆస్తి కోసం అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు అంటూ ఏటో వెళ్లిపోయాడు. అస‌లు స్క్రీన్‌పై ఏం జ‌రుగుతుందో, ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాదు. హీరోయిన్‌ను కాద‌న్న హీరో త‌ల్లి చెప్పిన ఒక్క మాట‌కే మారిపోవ‌డం, హీరో ఓ డైలాగ్ చెప్ప‌గానే హీరోయిన్‌కు ఉన్న స‌మ‌స్య తొల‌గిపోవ‌డం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది.

హీరో ఫ్యామిలీ మారిపోయే స‌న్నివేశాలు ఫోర్స్‌డ్‌గా ఉన్నాయి. దామినికి స‌మ‌స్య రావ‌డం వెనుక ఏదో పెద్ద ట్విస్ట్ ఉన్న‌ట్లుగా చివ‌రి వ‌ర‌కు దాచిపెట్టారు. రివీల‌య్యే ఫ్లాష్‌బ్యాక్ సిల్లీగా అనిపిస్తుంది. నాయ‌కానాయిక‌ల కెమిస్ట్రీ అయినా స‌రిగ్గా చూపించ‌లేక‌పోయారు.

తెలంగాణ నేప‌థ్యం ఓ సుకుమారికి పెద్ద‌గా ప్ల‌స్స‌వ్వ‌లేదు. డైలాగ్స్‌లో స‌హ‌జ‌త్వం లోపించింది. రిపీటెడ్ సీన్లు, ఎమోష‌న్ల‌తో ఆడియెన్స్ ఓపిక‌కు ఓ ప‌రీక్ష‌లా ఈ సినిమా ఉంటుంది. పాయింట్‌లెస్‌గా సాగే ఈ సినిమాను త‌మ న‌ట‌న‌తో నిల‌బెట్ట‌డానికి ఐశ్వ‌ర్య రాజేష్, తిరువీర్ చాలానే ప్ర‌య‌త్నించారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

ఫోక‌స్ పాయింట్‌: ఆడియెన్స్‌కు షాక్

రేటింగ్: 1.5/5

 

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus