ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఓం'(ఆపరేషన్ మోల్). ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ సినిమా మొదటి భాగం ‘O.M – చాప్టర్ 1: రుధిరం’(OM) పేరుతో నవంబర్ 20న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా వదిలిన.. టీజర్, ట్రైలర్ వంటివి మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సాయి అభ్యంకార్ సంగీతంలో రూపొందిన ‘వీర వీర’ ట్యూన్ ‘ఓం’ సినిమా ఎక్కువ వైరల్ అయ్యేలా చేసింది.
ఈ చిత్రం తెలుగు హక్కులను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ దక్కించుకుంది. నైజాం ఏరియాలో ‘మైత్రి’ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీకి చెందిన కొంతమందికి స్పెషల్ షో వేసి చూపించారు. సినిమా చూసిన వారు అనంతరం తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘ఓం’ చిత్రం నిడివి 2 గంటల 58 నిమిషాలు ఉంటుందట.
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని పుణ్యక్షేత్రాల మధ్య విస్తరించిన వేల కోట్ల ఎర్రచందనం (రెడ్ గోల్డ్ గా పిలవబడుతుంది) స్మగ్లింగ్ మాఫియా, దాన్ని అంతం చేయడానికి పోలీసులు వేసే రహస్య వ్యూహం చుట్టూ ఈ కథ తిరుగుతుందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. నాయుడు పేట అమ్మాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అమరుడి కుమార్తె అయిన నిత్యారెడ్డి ఐపీఎస్ (సాయి పల్లవి), ఏపీ పోలీస్ నుండి సీబీఐ, ఇంటర్‌పోల్ వరకు పనిచేసిన సమర్థవంతమైన ఆఫీసర్ గా కనిపిస్తుందట.
ఎర్రచందనం దోపిడీతో ప్రకృతిని చెడగొట్టే వారిపై ఆమె కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటుందట. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్సిడెంట్ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె మరింత పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సామ్రాజ్యానికి అసలైన మాస్టర్‌మైండ్ అయిన కార్తికేయన్ (మమ్ముట్టి) నెట్‌వర్క్‌ను కూల్చడానికి ‘ఆపరేషన్ మోల్’ ప్రారంభిస్తుందట. ఇందులో భాగంగా OCIU ఆఫీసర్ ‘D-402’ గా (ధనుష్) ఓ కోవర్ట్‌గా మమ్ముట్టి గ్యాంగ్‌లోకి చొరబడతాడని స్పష్టమవుతోంది.
ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ అని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుందట. యాక్షన్ ఎపిసోడ్స్ మంచి థ్రిల్ ఇస్తాయని అంటున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ ట్రాక్, క్లైమాక్స్ హైలెట్ అంటున్నారు. మొత్తంగా ఆడియన్స్ కి ‘ఓం’ మంచి యాక్షన్ ఫీస్ట్ ఇస్తుందని.. మమ్ముట్టి, ధనుష్, సాయి పల్లవి వంటి బెస్ట్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కోసం కచ్చితంగా ఈ సినిమాని ధియేటర్లలో చూడొచ్చని చెబుతున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి!