‘పెద్ది’ సినిమా గురించి చర్చలు జరుగుతున్న తొలి రోజులు.. అంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడు అని వార్తలు వస్తున్న రోజుల్లో ఈ సినిమా మల్లయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కనుంది అని అన్నారు. ఆ తర్వాత వివిధ మార్పులు జరిగి రామ్‌చరణ్ సినిమాలోకి వచ్చాడు. తొలినాళ్లలో ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో అనుకున్నారు కానీ రీసెంట్ టీమ్ ఇస్తున్న ప్రచార సామాగ్రి చూశాక ఇది మల్లయోధుల కథ కూడా అని తేలింది. దీంతో గతంలో వినిపించిన ‘దంగల్’ కంపారిజన్ బయటకు వచ్చింది.
‘దంగల్’ సినిమా తరహాలోనే ‘పెద్ది’ సినిమా ఉండబోతోంది అని ఆ మధ్య అనుకున్నారు లెండి. తన ఊర్లో ఉన్న అమ్మాయిలను మల్లయుద్ధానికి రెడీ చేసి దిల్లీ తీసుకెళ్లి అక్కడ తన ఊరుకు మంచి పేరు తీసుకొచ్చే ‘పెద్ది’ కథ అన్నారులెండి. ఇదంతా ఇలా ఉంటే ‘పెద్ది’ సినిమా టీమ్ కూడా సెట్‌లో ‘దంగల్’ సినిమాను పేరును తెగ గుర్తు చేసుకుంది అని అర్థమవుతోంది వారి మాటల బట్టి. అయితే ‘ఆ సినిమాలా ఉండకూడదు మన సినిమా’ అని అనుకున్నారట. ఈ విషయాన్ని రీసెంట్‌గా ఆర్ట్ డైరక్టర్ అవినాష్ కొల్లా చెప్పుకొచ్చారు.
‘పెద్ది’ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ‘దంగల్’ సినిమా గుర్తుకు రాకూడదనేది మా టీం ముందున్న సవాలు. అందుకే సెట్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడా ‘దంగల్’ సినిమాను పోలిన సెట్‌లు వేయలేదు. ప్రేక్షకులు ఇదివరకే ఇలాంటి సెట్స్ చూశామనే భావన కలగకుండా ఉండటానికి ప్రయోగాలు చేశాం. ‘పెద్ది’లో కొత్త ఆలోచనలు చేశాం అని అవినాశ్ కొల్లా చెప్పుకొచ్చారు. అయితే రెండూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లు కావడం కాస్త ఆ సినిమా వాసనలు వచ్చే అవకాశం ఉంది. మరేం చేశారో థియేటర్లలో తేలుతుంది.
రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. రూ.300 కోట్ల వరకు ఖర్చు అయిందని టాక్. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నారు. సినిమాను జూన్ 4న తీసుకొస్తారనే విషయం తెలిసిందే.