రాజమౌళి చిత్రమంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.. అందులో సందేహమే లేదు. కానీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చే సినిమాల్ని చాలా పట్టి పట్టి చూస్తుంటారు అనేది కూడా సత్యమే. ఈ సీన్లో లాజిక్ లేదు… జక్కన్న తన డైరెక్షన్ తో మ్యాజిక్ చేసేసాడు అని కొందరు ఫిలిం విశ్లేషకులు చెబుతుంటారన్న సంగతి కూడా తెలిసిందే. ‘బాహుబలి’ చిత్రం సమయంలో ఆ చిత్రంలో కొన్ని తప్పులున్నాయి అంటూ యూట్యూబ్లో కొన్ని వీడియోలు పోస్ట్ అయ్యాయి. వీటి పై కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ… అందులో కూడా రాజమౌళిని పొగుడుతున్నట్టే ఉంటాయి. అయినప్పటికీ ఇవి రాజమౌళి కూడా గమనించినట్టున్నాడు. ఇప్పుడు తను చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఆ పొరపాట్లు జరుగకుండా చూడాలని చూస్తున్నట్టున్నాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
అసలు విషయానికి వస్తే అనుకున్న ప్లాన్ ప్రకారం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర షూటింగ్ సెరవేగంగా జరిగిపోతుంది. ఇప్పటికే ప్రత్యేకంగా భారీ భారీ సెట్లు వేసి అందులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. 1920 కాలం నాటి నేపథ్యంలో సాగే కథ కాబట్టి లాజిక్ ప్రకారం… ఆ కాలం నాటి కార్లను కూడా ఈ సినిమాలో చూపించాలని రాజమౌళి భావిస్తున్నాడట. దీనికోసం బెంగళూర్ కి చెందిన రవిప్రకాశ్ అనే బిజినెస్మెన్ .. ఆ కాలానికి చెందిన ప్రత్యేకమైన కార్లను సేకరించి .. వాటిని అద్దెకు ఇస్తూ ఉంటాడని… చారిత్రక నేపథ్యంతో సినిమాలు చేసేవాళ్ళకి ఒకటి రెండు వారాలకి వాటిని అద్దెకి ఇస్తుంటాడని తెలుసుకున్న జక్కన్న… వెంటనే ఆయనని కలిసి, 1920 నాటి కార్లను ఒక ఏడాదికి అద్దె మాట్లాడుకుని తెప్పించాడట. ఇందుకుగాను రవిప్రకాశ్ కి భారీమొత్తమే చెల్లించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈసారి ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో రాజమౌళి కాస్త ఎక్కువ శ్రద్దే పెడుతున్నట్టు స్పష్టమవుతుంది.