ప్రముఖ మలయాళ నటుడు, నేషనల్ అవార్డు గ్రహీత సలీం కుమార్ (56) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. సలీం గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేశాయి.
అయితే ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. తిరిగి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన కన్నుమూశారు. సలీం మృతిపై మాలీవుడ్ ప్రముఖులు, కేరళ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
సలీం అక్టోబర్ 9, 1969న కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉన్న ఉత్తర పరవూర్‌లో జన్మించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా జర్నీ ప్రారంభించిన ఆయన కొచ్చిన్ కళాభవన్, ఆసియా నెట్‌లోని కామిక్ కోలా షోతో గుర్తింపు పొందారు. ఆ గుర్తింపుతో ‘ఇష్టమాను నూరు వట్టం’ అనే సినిమాతో 1997లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా గత మూడు దశాబ్దాలుగా 300కు పైగా సినిమాల్లో నటించారు.
తొలి రోజుల్లో కామెడీ పాత్రలకే పరిమితమైన సలీం ఆ తర్వాత సీరియస్ రోల్స్ కూడా చేశారు. అలా చేసిన ‘ఆడామింటే మకాన్ అబు’ అనే సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. నాలుగు కేరళ స్టేట్ అవార్డులు కూడా కెరీర్‌లో వచ్చాయి. ‘కరుత జూతన్’, ‘దైవమే కైతోళం కె. కుమార్ ఆకణం’ లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇక సలీమ్‌కు భార్య సునీత, కుమారులు చందు, ఆరోమల్ ఉన్నారు. ‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులు.