కంగన రనౌత్ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ‘క్వీన్’ అయితే… ఆమె పేరును ట్రెండింగ్‌లో నిలిపిన చిత్రం ‘మణికర్ణిక’. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా అది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన వివిధ పరిణామాలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. క్రిష్‌ను దర్శకత్వం నుంచి పక్కన పెట్టడం, సోనూ సూద్ పాత్రను తగ్గించడం లాంటివి చాలా జరిగాయి. ఈ విషయంలో మీడియా రెండుగా విడిపోయింది. కొందరు కంగన కరెక్ట్ అంటే… ఇంకొందరు క్రిష్ కరెక్ట్ అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లడుతున్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే ‘మణికర్ణిక’ సీక్వెల్ రాబోతోందట.
కంగనా రనౌత్ మరోసారి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అవతారమెత్తనుంది. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’కు సీక్వెల్ తీయాలని చిత్రబృందం భావిస్తోందట. ‘ది లెజెండ్ ఆఫ్ దిద్దా’ పేరుతో సీక్వెల్ సిద్ధం చేస్తున్నారట. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ‘మణికర్ణిక’ అప్పట్లో సంచలనమే సృష్టించింది. సినిమాకు పెట్టిన ఖర్చు, వేసిన సెట్స్, కంగన ఆహార్యం, యుద్ధ సన్నివేశాలు.. ఇలా అన్నీ భారీగానే ఉంటాయి ఆ సినిమాలో. ఇప్పుడు అంతకు మించిన రీతిలో సీక్వెల్ తీస్తారని తెలుస్తోంది. తొలి సినిమా తీసిన కమల్ జైన్ ఈ సినిమాకు కూడా నిర్మాత.
సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయట. స్క్రిప్ట్ వర్క్ కూడా చివరిదశకొచ్చిందట. ఇందులో కంగన.. కశ్మీర్ యోధురాలిగా కనిపిస్తుందట. కాలు పోలియో బారిన పడినా.. ఆమె గజనీని రెండుసార్లు యుద్ధంలో ఓడిస్తుందట. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరు అనే విషయంలో ఎలాంటి సమాచారం లేదు. తొలి ‘మణికర్ణిక’ లాగా వేరే దర్శకుణ్ని పెడుతుందా.. లేక ఆమెనే ఆ పని కూడా చేసేస్తుందా అనేది చూడాలి. కంగనక్క మెగాఫోన్ పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!