ఇస్మార్ట్ శంకర్ తో తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “రెడ్”. గతేడాది విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ.. లాక్ డౌన్ కారణంగా సంక్రాంతి బరిలోకి దిగింది చిత్రం. 2019లో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న “తడం” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (జనవరి 14) విడుదలైంది. మరి తమిళ వెర్షన్ స్థాయిలో తెలుగు వెర్షన్ ఆకట్టుకుందా? తెలుగు ప్రేక్షకులను అలరించగలుగుతుందా? అనేది చూద్దాం..!!
కథ: ఆదిత్య-సిద్ధార్థ్ (రామ్) ఐడెంటికల్ ట్విన్స్. తల్లిదండ్రుల మధ్య వచ్చిన పొరపచ్చాల కారణంగా వాళ్లిద్దరూ చిన్నప్పుడే విడిపోతారు. పరిస్థితుల కారణంగా అన్నదమ్ములు వేర్వేరు జీవితాల్లో స్థిరపడతారు. చదువుకొని సివిల్ ఇంజనీర్ గా సెటిల్ అవుతాడు సిద్ధార్థ్. చదువు మానేసి దొంగగా జీవనం సాగిస్తుంటాడు ఆదిత్య. ఒక హత్య కేసులో అరెస్ట్ అవుతాడు సిద్ధార్థ్, అయితే.. హత్య చేసింది సిద్ధార్థ్-ఆదిత్యలలో ఎవరు అనేది కనిపెట్టడానికి యామిని (నివేతా పేతురాజ్) విశ్వప్రయత్నం చేస్తుంది. చివరికి ఏం జరిగింది? అసలు హత్య చేసింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? అనేది “రెడ్” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా రామ్ రెండు పాత్రలకు వేరియేషన్స్ చూపించడంలో విఫలమయ్యాడు. సిద్ధార్థ్ కంటే ఆదిత్య పాత్రనే బాగా ఓన్ చేసుకోవడం వలన క్లాస్ రోల్లో వైవిధ్యం ప్రదర్శించలేకపోయాడు. మాస్ రోల్ కు మాత్రం బాగా న్యాయం చేసాడు. మ్యానరిజమ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. మాళవిక, అమృత అయ్యర్, నివేతా పేతురాజ్, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, సత్య, పవిత్ర లోకేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమా కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడింది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఆయన ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ సోసోగా ఉన్నాయి. దర్శకుడు కిషోర్ తిరుమల ఒరిజినల్ కథను అడాప్ట్ చేసుకోవడానికి పెద్దగా ప్రయత్నించలేదు. కథనాన్ని అవసరానికి మించి సాగదీసాడు. చేసిన చిన్నపాటి మార్పులు కూడా సినిమాకి ప్లస్ అవ్వకపోగా.. మైనస్ గా మారాయి. అసలు అవసరం లేని కథలో పాటలు ఇరికించడం అనేది రన్ టైం పెంచడానికి తప్ప దేనికీ ఉపయోగపడలేదు. అలాగే.. సినిమాలో మెయిన్ పాయింట్ అయిన ఫ్లాష్ బ్యాక్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరోయిన్స్ ను పాత్ర మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు.
నివేతా పేతురాజ్ పాత్రను ఇంకాస్త మౌల్డ్ చేయవచ్చు కానీ.. పెద్దగా ఎఫర్ట్ చూపించలేదు. ప్రీప్రొడక్షన్ కాకపోయినా లాక్ డౌన్ పుణ్యమా అని దొరికిన 10 నెలల టైంను పోస్ట్ ప్రొడక్షన్ కోసం సరిగ్గా వినియోగించుకొని ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే పరంగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా కనీసం యావరేజ్ గా నిలిచేది. కానీ.. తమిళంలో ఉన్న ల్యాగ్ ను తెలుగు వెర్షన్ లో కూడా కంటిన్యూ చేయడం, క్యారెక్టర్ ఆర్క్ ను మైంటైన్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ ఎవరి పాత్రకు కనెక్ట్ అవ్వలేక, సినిమాలో లీనం కాలేక మిన్నకుండిపోతారు.
విశ్లేషణ: రామ్ కి వీరాభిమానులైతే తప్ప అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటో అర్ధం కాని “రెడ్”ను థియేటర్లో రెండున్నర గంటలు కూర్చుని చూడడం కాస్త కష్టం. తమిళ వెర్షన్ చూసినవాళ్లకి ఓ మోస్తరుగా కూడా ఎక్కని ఈ “రెడ్”, చూడనివాళ్లను ఆకట్టుకొనే ప్రయత్నంలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ కారణంగా సంక్రాంతికి సూపర్ హిట్ గా నిలుస్తుందనుకున్న సినిమా సైడైపోయింది. “క్రాక్, మాస్టర్”ల దుందుభి ముందు “రెడ్” నిలబడడం కష్టమే!
రేటింగ్: 2.5/5