క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

“రాజా ది గ్రేట్” అనంతరం రవితేజ హిట్ అనే పదానికి దాదాపుగా దూరమైపోయాడు. కొంత విరామం అనంతరం తనకు “డాన్ శీను, బలుపు” లాంటి మాస్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నటించిన చిత్రం “క్రాక్”. తెలుగులో శ్రుతిహాసన్ రీఎంట్రీ సినిమా ఇది. రవితేజ-శ్రుతిహాసన్-గోపీచంద్ మలినేనిలకు చాలా ఇంపార్టెంట్ సినిమా “క్రాక్”. ఈ ముగ్గురికీ ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా అవసరం. మరి నిన్న ఉదయం నుంచి విడుదల వాయిదాపడుతూ ఎట్టకేలకు సెకండ్ షోతో విడుదలైన “క్రాక్” ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందా? ఈ ముగ్గురూ హిట్ అందుకోగలిగారా అనేది చూద్దాం..!!

కథ: పోతరాజు వీరశంకర్ (రవితేజ) నిఖార్సైన పోలీస్ ఆఫీసర్. అందమైన భార్య కల్యాణి (శ్రుతిహాసన్), చలాకీ కొడుకు, డ్యూటీపై భక్తి, భయపడని వ్యక్తిత్వంతో పోలీస్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. అతడి డ్యూటీలో భాగంగా ఎదుర్కొన్న ముగ్గురు వ్యక్తులు.. కర్నూలులో ఒక టెర్రరిస్ట్ (చిరాగ్ జానీ), ఒంగోలులో కటారి కృష్ణ (సముద్రఖని), కడపలో లోకల్ రౌడీ (రవిశంకర్)లను ఎలా ఫేస్ చేసాడు? అనేది “క్రాక్” కథాంశం.

నటీనటుల పనితీరు: రవితేజకు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం కొత్తేమి కాదు. ఈ సినిమాలోనూ కోర మీసంతో పోలీసోడి రోషాన్ని స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజంట్ చేసాడు రవితేజ. రవితేజ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ లు మాస్ ఆడియన్స్ కు, రవితేజ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటివి. శ్రుతిహాసన్ గ్లామర్ తో ఆకట్టుకోలేకపోయినా నటిగా అలరించింది. ఆమె యాక్షన్ ఎపిసోడ్ ఒన్నాఫ్ ది హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. కటారి కృష్ణగా సముద్రఖని, కడప రౌడీగా పి.రవిశంకర్ లు విలనిజం వేరే లెవల్లో పండించారు. జయమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర, నటన ఆకట్టుకుంటాయి. సప్తగిరి కామెడీ పండించడానికి ప్రయత్నించాడు కానీ వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ విష్ణు పనితనాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. యాక్షన్ బ్లాక్స్, లైటింగ్, డి.ఐ విషయంలో అతడు తీసుకున్న శ్రద్ధ ఆడియన్స్ కు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించింది. ఎడిటర్ కూడా ఎక్కడా బోర్ కానీ ల్యాగ్ కానీ లేకుండా చక్కగా సినిమాను ట్రిమ్ చేసేసాడు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్ క్రేజీగా,కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా ఒంగోలు బస్టాప్ ఫైట్, వేటపాలెం బీచ్ ఫైట్ మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. స్టైలిష్ గా మంచి ఇంటెన్సిటీతో కొరియోగ్రాఫ్ చేశారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణల్లో ప్రాసలు కాస్త ఎక్కువైనా.. మాస్ ఆడియన్స్ కు నచ్చుతాయి.

ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని రెండుమూడు తమిళ సినిమాల నుంచి కథను,కథనంలోని కీలకాంశాలు కాస్త ఎక్కువగా స్ఫూర్తి పొందాడు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో స్క్రీన్ గురించి పట్టించుకోలేదు, సెకండాఫ్ లో టేకాఫ్ బాగుంది కానీ, ఇంటెన్సిటీ మిస్ అయ్యింది. దర్శకుడిగా, కథకుడిగా గోపీచంద్ చాలా చోట్ల గాడి తప్పాడు. అయితే.. సీన్ కంపొజిషన్ & యాక్షన్ బ్లాక్స్ తో నెట్టుకొచ్చేసాడు. సినిమాలో ఉన్న ఎంగేజింగ్ ఎలిమెంట్స్ కు మంచి కథ-కథనం తోడైతే.. ఇంకాస్త పెద్ద హిట్ అయ్యేది. ఇక తమన్ పాటలు, నేపధ్య సంగీతంతో ఆడియన్స్ కు మంచి ఎనర్జీ ఇచ్చాడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండడానికి తమన్ నేపధ్య సంగీతం ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు.

విశ్లేషణ: దాదాపు 9 నెలల తర్వాత థియేటర్లలో విడుదలైన మాస్ బొమ్మ, కాబట్టి మాస్ ఆడియన్స్ ఎగబడి చూడడం ఖాయం, ఇక “రవన్న హిట్ ఎప్పుడు కొడతాడా?!” అని ఆశతో ఎదురుచూస్తున్న రవితేజ అభిమానులు థియేటర్లలో హల్ చల్ చేయడం కూడా ఖాయం. ఒక రకంగా విడుదల డిలే అవ్వడం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. మూడు షోలు క్యాన్సిల్ అవ్వడం వల్ల సింపతీ వేవ్ క్రియేట్ అవ్వగా, నిన్న రాత్రి నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ వల్ల ఆడియన్స్ లో సినిమా చూడాలన్న ఉత్సాహం పెరిగింది. ఇవన్నీ కలగలిసి “క్రాక్”ను కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలపడం ఖాయం. ఎట్టకేలకు రవితేజ హిట్ కొట్టేసాడన్నమాట.

రేటింగ్: 3/5

Click Here To Read In English

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus