సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుడో లేక షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు.. ఆ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి ఉండేది. వాళ్లు ఆ మాటకు తగ్గట్టుగానే సినిమాను రిలీజ్ చేసేవారు కూడా. ఇప్పుడు అక్కడ కూడా రిలీజ్ చేయడం లేదు. ఇక తెలుగులో కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. కానీ సినిమా టీమ్‌లు మాత్రం ఆ రిలీజ్ డేట్ రెండు, మూడు వారాల ముందు లేదంటే నెల రోజుల ముందు వరకు ‘కచ్చితంగా అదే డేట్‌కి వస్తాం’ అనే చెబుతున్నారు.
ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే.. వరుస పెట్టి టాలీవుడ్‌లో ఇలాంటి సినిమాల వాయిదాలు పెరిగిపోతున్న సమయంలో ఓ సినిమా టీమ్ మాత్రం మేం కచ్చితంగా చెబుతోంది. ఆ సినిమానే ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’. ఈ సినిమా కూడా వాయిదా పడొచ్చు అంటూ గత కొన్ని రోజులుగా సినిమా టీమ్ లీక్‌లు వస్తున్నాయి. అయితే అవి పుకార్లు మాత్రమేనని చిత్ర బృందం కొట్టిపారేసింది. ‘స్పిరిట్’ సినిమాను ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మార్చి 5, 2027న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని చెబుతున్నారు.
నిజానికి టీమ్ చెబుతున్నట్లు ఆ టైమ్‌కి రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఇంకా 10 నెలల టైమ్ ఉంది. కానీ ఈ సినిమాను పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని చెబుతున్నారు. మొత్తంగా ఎనిమిది భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తామని కూడా చెబుతున్నారు. అంటే సినిమా ప్రీప్రొడక్షన్, షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్‌కి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అన్ని భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసుకోవడం, అవసరమైతే ప్యాచ్ వర్క్‌లు చేసుకోవడం లాంటివి ఉంటాయి.
దానికితోడు ప్రభాస్ సినిమాలకు ఎప్పుడు సడన్ బ్రేక్‌లు పడతాయో తెలియదు. ఈ సమయంలో పక్కాగా మాట మీద నిలబడటం పెద్ద విషయమే. చూద్దాం సందీప్ రెడ్డి వంగా ప్లానింగ్ ఎలా ఉందో?