Suzhal 2 Review in Telugu: సుడల్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కథిర్ (Hero)
  • ఐశ్వర్య రాజేష్ (Heroine)
  • లాల్, శరవణన్, మంజిమా మోహన్ తదితరులు.. (Cast)
  • బ్రమ్మ జి - సర్జున్ కేఎం (Director)
  • పుష్కర్ - గాయత్రి (Producer)
  • సామ్ సి.ఎస్ (Music)
  • అబ్రహాం జోసఫ్ (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 28, 2025

2022లో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన “సుడల్” అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. “విక్రమ్ వేద” ఫేమ్ పుష్కర్-గాయత్రి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ కి లభించిన ఆదరణతో సెకండ్ సీజన్ ను విడుదల చేశారు. మొదటి సీజన్ ఆర్టిస్టులతోపాటుగా కొత్త ఆర్టిస్టులు కూడా నటించిన ఈ సిరీస్ మరో కొత్త కేసు డీల్ చేస్తుంది. మరి ఈ సెకండ్ సీజన్ ఎలా ఉందో చూద్దాం..!!

Suzhal 2 Review

కథ: నందిని (ఐశ్వర్య రాజేష్) తన చెల్లెలి మరణానికి కారణమైన గుణని చంపిన కేసులో ఆండర్ ట్రయిల్ జైల్లో ఉంటుంది. ఆమెను బయటికి తీసుకురావడానికి ఎస్సై చక్రి (కథిర్) మరియు లాయర్ చెల్లప్ప (లాల్) ప్రయత్నిస్తుంటారు. మరికొన్ని రోజుల్లో నందిని బయటకి వస్తుంది అనగా.. ఆమె తరపున కేస్ వాదిస్తున్న చెల్లప్ప ఊహించని రీతిలో హత్య చేయబడతాడు. ఈ కేస్ ను చక్రి డీల్ చేయడం మొదలుపెడతాడు.

అయితే.. ఈ హత్య తాము చేశాము అంటూ ఓ ఎనిమిది మంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్లో లొంగిపోతారు. దాంతో కేస్ ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తుంది. అసలు చెల్లప్పను చంపింది ఎవరు? ఈ ఎనిమిది మంది అమ్మాయిలకు చెల్లప్పతో సంబంధం ఏమిటి? ఈ మిస్టరీని చక్రి ఎలా సాల్వ్ చేశాడు? అనేది ఈ సిరీస్ (Suzhal 2) యొక్కం కథాంశం.

నటీనటుల పనితీరు: సిరీస్ మొత్తంలో ఆశ్చర్యపరిచిన నటి మంజిమా మోహన్. ఆమె పాత్రకు ఉన్న వెయిటేజ్ ను చాలా బాగా క్యారీ చేసింది. ఆమె నుంచి ఈ స్థాయి నటన, ఈ తరహా పాత్ర అస్సలు ఊహించలేదు. ఐశ్వర్య రాజేష్ నటన బాగున్నప్పటికీ, ఆమె పాత్ర చుట్టూ డ్రామా అంతగా వర్కవుట్ అవ్వలేదు. కథిర్ కి మంచి రోల్ పడింది. మంచి నటనతో పాత్రను పండించాడు కూడా.

సంయుక్త విశ్వనాథ్, నిఖిల శంకర్, గౌరి కిషన్, రిని, అభిరామి బోస్ తదితరులు విభిన్నమైన షేడ్స్ ఉన్న అమ్మాయిలుగా అదరగొట్టారు. ముఖ్యంగా సంయుక్త విశ్వనాథ్ నటన అందరికంటే హైలైట్ గా నిలుస్తుంది. మరో మంచి పాత్రలో మోనిషా ఆకట్టుకుంది.

సీనియర్ యాక్టర్ లాల్ పాత్ర భలే ఆసక్తికరంగా సాగుతుంది. ఆయనకి ఉన్న ఇమేజ్ కారణంగా పాత్రతో ఇచ్చిన ట్విస్టులు బాగా వర్కవుట్ అయ్యాయి. సపోర్టింగ్ రోల్ లో చాందిని, కీలకమైన పాత్రలో ఆర్ష్య లక్ష్మణ్ లు అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: సామ్ సి.ఎస్ థ్రిల్లర్స్ కి పెట్టింది పేరు. ఆసక్తి నెలకొల్పడం కానీ, ఎగ్జైట్ చేయడంలో కానీ సిద్ధహస్తుడు. అందులోనూ మైథలాజికల్ టచ్ ఉండడంతో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతాడు. సామ్ నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటివన్నీ ఒకర్ని ఒకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ముఖ్యంగా.. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. చివరి ఎపిసోడ్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ బ్లాక్ ను కుదిరినంతవరకు రియలిస్టిక్ గా తెరకెక్కించారు.

దర్శకులు బ్రమ్మ & సర్జున్ లు మొదటి సీజన్ ఫార్మాట్ లోనే సెకండ్ సీజన్ ను కూడా నడిపారు. మొదట ఒక కేస్, ఆ కేస్ లో వచ్చే మలుపులు, చివరి వరకు ఆ కేస్ ను చూసే దృష్టికోణం ఒకటి, ఎండింగ్ లో వచ్చే దృష్టికోణం మరొకటి.. ఇలా 8 ఎపిసోడ్స్ వరకు ఆడియన్స్ ను థ్రిల్ చేసే ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉండేలా చూసుకున్నారు దర్శకులు. ముఖ్యంగా బిగ్ ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం సింపుల్ గా ఉన్నా..

ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే.. జైల్ ఎపిసోడ్స్ ను వీలైనంత సహజంగా చిత్రించిన విధానం కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. అన్నిటికీ మించి సిరీస్ లో ఎక్కడా అనవసరమైన బూతులు కానీ, అసభ్యకరమైన శృంగార సన్నివేశాలు కానీ లేకపోవడం అనేది దర్శకులుగా వారి టేస్ట్ కు నిదర్శనంగా నిలిచింది. అలాగే.. సిరీస్ యొక్క కథను నాగకన్య డ్రామాతో ఎలివేట్ చేసే సందర్భం, సిరీస్ కథనాన్ని మరియు క్లైమాక్స్ ను అసుర అమ్మవారి తిరణాళ్లతో ప్యారలల్ గా రన్ చేసిన విధానం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా దర్శకులుగా బ్రమ్మ-సర్జున్ & మేకర్స్ గా పుష్కర్-గాయత్రి “సుడల్ 2”తోనూ పూర్తిస్థాయిలో ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసారు.

విశ్లేషణ: చాలా నిశితమైన రాతతో ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు చాలా అరుదు. హిందీలో “పాతాళ్ లోక్, అసుర్” లాంటి సిరీస్ లు మన సౌత్ లో ఎందుకు తీయరు అనుకునేవాళ్ళం. అందుకు దొరికిన సమాధానమే “సుడల్”. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఎక్కడా డీవియేట్ అవ్వకుండా, ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తూ 8 ఎపిసోడ్స్ సిరీస్ ను రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో మాత్రం మేకర్స్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ వెబ్ సిరీస్ ఈ “సుడల్ 2”.

ఫోకస్ పాయింట్: ఎక్సైటింగ్ థ్రిల్లర్!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus