సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ‘రాజకుమారుడు’ మొదటి సినిమాగా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ కొట్టింది. కానీ చాలా మందికి తెలీని విషయం ఏంటంటే.. ‘మురారి'(Murari) మహేష్ కి మొదటి సినిమా అవ్వాలి. కృష్ణకి వీరాభిమాని అయినటువంటి నిర్మాత రామలింగేశ్వరరావుకి మహేష్ బాబుని లాంచ్ చేసే అవకాశం ఇచ్చారు కృష్ణ. అయితే రామలింగేశ్వరరావు.. ఆ సినిమాని కృష్ణవంశీతోనే చేద్దామని చెప్పారు.
కృష్ణవంశీకి ఈ విషయం చెబితే.. ‘మహేష్ ఒక సినిమా చేశాక చేద్దాం లెండి’ అన్నాడట. ఇదే మాట కృష్ణకి ఎలా చెప్పాలో తెలీక ‘కృష్ణవంశీ బిజీగా ఉన్నాడు’ అని చెప్పారట రామలింగేశ్వరరావు. అప్పుడు వేరే డైరెక్టర్ తో చేద్దామని కృష చెబితే.. లేదు కృష్ణవంశీతోనే చేయాలి అని పట్టుబట్టారట. దీంతో మహేష్..ని అశ్వినీదత్,కె.రాఘవేంద్రరావు చేతుల్లో పెట్టి ‘రాజకుమారుడు’ చేయించారు కృష్ణ. అలా ‘రాజకుమారుడు’ వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది.
కానీ ‘రాజకుమారుడు’ తర్వాత మహేష్ బాబు చేసిన ‘యువరాజు’ ‘వంశీ’ ఆడలేదు. మరోపక్క పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇలాంటి టైంలో రామలింగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చి ‘మురారి’ ప్రాజెక్టు సెట్ చేశారు.
అయితే కృష్ణవంశీ ‘మురారి’ స్క్రిప్ట్ కోసం సైంటిస్టులా మారి చాలా పరిశోధన చేశారట. ఇందుకోసం తేనేటి హేమలత రచించిన ఓ బుక్ ని చదివారట. మహేష్ ని చూడగానే బృందావనంలో కృష్ణుడిని ఊహించుకున్నారట. అలాగే పోతన భాగవతం చదివి,సీనియర్ ఎన్టీఆర్ పాత సినిమాలన్నీ చూసి అంతర్వేది వంటి ఏరియాలు తిరిగారట. అక్కడ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ దుర్మరణాల టాపిక్ వచ్చిందట.
ఆ ఫ్యామిలీకి శాపం ఉంది అని వాళ్ళు మాట్లాడుకోవడాన్ని కృష్ణవంశీ గమనించారు. తర్వాత కృష్ణ- గుంటూరు జిల్లాకి చెందిన ఓ పెద్ద రాజకీయవేత్తతో పాటు అతని ముగ్గురు కొడుకులు 3 నెలల గ్యాప్లో చనిపోయిన అంశాన్ని కూడా చర్చించుకున్నారట.వాళ్ళ ఇంట్లో పనిమనిషి శాపం పెట్టడం వల్ల ఆ ముగ్గురూ చనిపోయినట్టు చెప్పుకున్నారట. వీటిని ఆధారం చేసుకుని ‘మురారి’ కథ అల్లారు కృష్ణవంశీ.
కానీ ‘మురారి’ కథ కృష్ణవంశీ చెబితే భయపడిపోయారట కృష్ణ. హీరో చావు బ్రతుకులతో పోరాడటం, కమర్షియాలిటీ మిస్ అవ్వడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఓ మంచి ప్రేమకథ చేయండి అని సూచించారట. అయినా కృష్ణవంశీ వినే రకం కాదు కదా. మరోపక్క రామలింగేశ్వరరావు కృష్ణకి ఎంత ఫ్యాన్ అయినప్పటికీ కృష్ణవంశీపైనే నమ్మకం ఎక్కువ కాబట్టి.. కన్విన్స్ చేసి ఒప్పించారట.
మొత్తానికి సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. కొన్ని దశాబ్దాల పాటు నిలిచిపోయే సినిమా తీయాలన్న తపనతో కృష్ణవంశీ ఈ సినిమా కోసం అంకిత భావంతో పనిచేశారట. ఆయన ఎవ్వరినీ లెక్క చేయలేదు. షూటింగ్ మధ్యలో నిర్మాత రామలింగేశ్వరరావు గారితో కూడా గొడవ వచ్చింది. అయినప్పటికీ తన బావమరిదిని పెట్టేసి కృష్ణవంశీపై గుడ్డి నమ్మకం పెట్టుకుని వెళ్లిపోయారట నిర్మాత రామలింగేశ్వరరావు.
సినిమా అంతా బాగా వచ్చింది అని తెలుసుకున్నారు. క్లైమాక్స్ లో ‘అలనాటి రామచంద్రుడు’ అనే పాట పెట్టాలని కృష్ణవంశీ అనుకున్నారట. కానీ కృష్ణగారు దానికి అభ్యంతరం తెలిపారు. క్లైమాక్స్ లో మాస్ సాంగ్ లేదా డాన్స్ సాంగ్ ఉంటేనే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారని కృష్ణ గారు చెప్పారట. అందుకు కృష్ణవంశీ ఒప్పుకోలేదట.’కావాలంటే సినిమా మొత్తం తీసేసి ఇస్తాను. మీరనుకునే పాట లాస్ట్ లో పెట్టి రిలీజ్ చేసుకోండి. కానీ డైరెక్టర్ గా నా పేరు మాత్రం వేయకండి’ అని తెగేసి చెప్పేశాడట కృష్ణవంశీ. దీంతో కృష్ణ కూడా దిగొచ్చి పెళ్లి పాటకి ఒప్పుకున్నారు.
అలా ‘మురారి’ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. 2001 ఫిబ్రవరి 17న రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ షో చూసిన కృష్ణ గారి అభిమానులకి ఈ సినిమా నచ్చలేదట. ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతలు కూడా మహేష్ బాబుకి ఇలాంటి సినిమా ఎందుకు చేశావ్ అంటూ క్లాసులు పీకారట.
అయితే సూపర్ స్టార్ కృష్ణ వారు తొలి షో చూసిన వెంటనే.. దర్శకుడు కృష్ణవంశీని పిలిపించి గట్టిగా హత్తుకుని థాంక్స్ చెప్పారట. మహేష్ బాబు 10 సినిమాల అనుభవాన్ని ‘మురారి’ తో సంపాదించుకున్నాడు అనేది కృష్ణ నమ్మకం. మెల్ల మెల్లగా ఈ సినిమాకి ఆదరణ పెరుగుతుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు అని కృష్ణ చెప్పారట.
ఆయన చెప్పినట్టే.. మొదటి వారం ‘మురారి’ ప్లాప్ టాక్ తోనే నడిచింది. కానీ సెకండ్ వీకెండ్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని వీక్షించడానికి థియేటర్లకు పోటెత్తారు. అలా మెల్ల మెల్లగా హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కూడా వసూళ్లు పెంచుకుంటూ పోయింది ‘మురారి’
ఫైనల్ గా 26 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకుంది.
‘మురారి’ లో హైలెట్స్ చాలా ఉంటాయి. ముందుగా మహేష్ బాబు నటన. ఎక్కడా అతను అప్ కమింగ్ హీరోలా అనిపించడు. అనుభవం ఉన్న నటుడిగానే ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాడు.
అలాగే మహేష్- సోనాలి బింద్రే పెయిర్.. వీళ్ళ మధ్యలో వచ్చే ఫన్నీ సీన్స్ బాగుంటాయి.
సీనియర్ నటి లక్ష్మీ, సీనియర్ నటుడు ప్రసాద్ బాబు..ల మధ్య ఓ ఎమోషనల్ ఉంటుంది ఈ సినిమాలో. ఆ సీన్లో మహేష్ బాబు బయట నిలబడి తన అన్న- వదిన..ల కన్వర్జేషన్ వింటూ కన్నీరు పెట్టుకుంటాడు. ఈ సీన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించారు. ‘చెప్పమ్మ చెప్పమ్మ’ ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ ‘అలనాటి రామచంద్రుడు’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
‘మురారి’ కి ‘అలా మొదలైంది’ దర్శకురాలు నందినీ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసుండదు.
అలాగే ‘వర్షం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన దివంగత స్టార్ రైటర్ శోభన్ కూడా ‘మురారి’ కి రైటర్ గా పనిచేశారు.
క్లైమాక్స్ లో మహేష్ బాబు పెర్ఫార్మన్స్, సినిమాటోగ్రఫీ అన్నీ టాప్ నాచ్ లో ఉంటాయి.
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి పనిచేస్తున్న స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ‘మురారి’ తో లాంచ్ అయ్యాడు అని చాలా మందికి తెలిసుండకపోవచ్చు.
2024 లో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘మురారి’ సినిమాకి 4K కి డిజిటలైజ్ చేసి రీ- రిలీజ్ చేయగా .. భారీ వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.
నేటితో ‘మురారి’ రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తిచేసుకుంటుంది. ఇది ఒక క్లాసిక్. టాలీవుడ్లో కొన్ని బెస్ట్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో ‘మురారి’ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.