టాలీవుడ్‌లో ఎక్కువ మంది హీరోలు ఉన్న కుటుంబం అంటూ మెగా ఫ్యామిలీ మీద కొంతమంది జోకులు వేస్తుంటారు కానీ.. అంతమంది హీరోలను అందివ్వడం, వచ్చినవాళ్లు వచ్చినట్లు విజయాలు సాధించడం, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా పెద్ద విషయం. ఇక ఆ కుటుంబం ఇంకా ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది అంటే ఆ కుటుంబ పెద్ద మెగాస్టార్ చిరంజీవినే (Chiranjeevi) కారణం. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.
తాజాగా వరుణ్‌తేజ్ (Varun Tej) కూడా చిరంజీవి గురించి, కుటుంబం కోసం ఆయన వ్యవహరించే విధానం గురించి మాట్లాడారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తన కొత్త సినిమా ‘మట్కా’ (Matka) ప్రచారంలో భాగంగా వరుణ్ తేజ్ ఇటీవల మీడియాతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ (Ram Charan) , అల్లు అర్జున్‌తో (Allu Arjun) ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్… కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడంలో చిరంజీవి పోషిస్తున్న పాత్ర గురించి కూడా చెప్పుకొచ్చారు.
ప్రతి ఆదివారం మీటింగ్‌లు పెట్టి అందరినీ ఒక్కటి చేస్తారని వరుణ్ చెప్పాడు. మేమంతా ఒకేచోట పెరిగాం. అందుకే రామ్ చరణ్‌తో తనకు చనువు ఎక్కువ అని చెప్పారు వరుణ్. ఏదైనా సమస్య వస్తే వెంటనే గుర్తొచ్చే వ్యక్తి చరణ్ అని కూడా చెప్పాడు. ఇప్పుడంటే ఎవరి పనుల్లో వాళ్లు అవ్వడంతో తరచుగా కలుసుకోవడం లేదని.. ఒకప్పుడు అంతా ఒక దగ్గరే ఉన్నామని చెప్పాడు. ఇప్పుడు పనుల బిజీ వల్ల ఒక్కోసారి ఒకరినొకరం చూడకుండానే నెలలు గడిచిపోతున్నాయని చెప్పాడు.
అయితే తాము ఎక్కడున్నా పెదనాన్న అందరినీ సంక్రాంతి వేడుకలో కలుపుతారని చెప్పాడు. ఏటా చిరంజీవి ఈ పండగను ఘనంగా సెలబ్రేట్ చేస్తారని, ఆ నాలుగు రోజులు అందరం కలసి ఎంజాయ్ చేస్తామని గుర్తు చేసుకున్నాడు. తాము ఎంత ఎదిగినా చిరంజీవి మాత్రం ఒకేలా చూస్తారని, మేము ఒదిగి ఉండడంలో కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. ఆయన మా కుటుంబంలో హెడ్‌మాస్టర్ లాంటి వ్యక్తి అని వరుణ్ చెప్పాడు. చిన్నతనంలో తనకు, రామ్‌చరణ్‌కు, అల్లుఅర్జున్‌కు చిరంజీవి చేతుల్లో దెబ్బలు పడ్డాయి అని నవ్వేశాడు వరుణ్.