Citadel Honey Bunny Review in Telugu: సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • November 7, 2024 / 09:58 AM IST

Cast & Crew

  • వరుణ్ ధావన్ (Hero)
  • సమంత (Heroine)
  • కేకే మీనన్, సిమ్రాన్, కశ్వి మజ్ముందర్, సాకిబ్ సలీం తదితరులు.. (Cast)
  • రాజ్ & డీకే (Director)
  • సయ్యద్ జాయిద్ అలీ - అలెక్ కానిక్ (Producer)
  • అమన్ పంత్ - అలెక్స్ బెల్చర్ (Music)
  • జోహాన్ హెర్లిన్ (Cinematography)
  • Release Date : నవంబర్ 07, 2024

“అవెంజర్స్” ఫేమ్ రుస్సో బ్రదర్స్ మొదలుపెట్టిన “సిటాడెల్” అనే సిరీస్ కు ఇండియన్ డివిజన్ గా రూపొందిన సిరీస్ “సిటాడెల్ హనీ బన్నీ”. వరుణ్ ధావన్, సమంత టైటిల్ పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ కి రాజ్ & డీకే దర్శకత్వం వహించారు. 6 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. యాక్షన్, డ్రామా, సస్పెన్స్ కలగలిసిన ఈ సిరీస్ ఆడియన్స్ ను ఏమేరకు ఎగ్జైట్ చేయగలిగిందో చూద్దాం..!!

Citadel Honey Bunny Review in Telugu:

కథ: ఇండియన్ లో ఓ సపరేట్ ఏజెన్సీ ఆపరేట్ చేస్తుంటాడు విశ్వ అలియాస్ బాబా (కేకే మీనన్). ఆ ఏజెన్సీకి లీడర్ రాహీ గంభీర్ అలియాస్ బన్నీ (వరుణ్ ధావన్). సిటాడెల్ కు పోటీగా వీళ్ల మిషన్స్ ఉంటాయి. ఓ సీక్రెట్ మెషీర్ లో హనీ ట్రాప్ చేయడం కోసం సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ అయిన హనీ (సమంత)ను టీమ్ లో చేర్చుకుంటారు. అలా మొదలైన హనీ-బన్నీల ప్రయాణం ఎలా సాగింది? సిటాడెల్ వీళ్లకు అడ్డంకిగా ఎందుకు మారింది? అసలు బాబా చేస్తున్న మిషన్ ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “సిటాడెల్ హనీ బన్నీ” వెబ్ సిరీస్.

నటీనటుల పనితీరు: కేకే మీనన్, వరుణ్ ధావన్, సమంత వంటి సీనియర్ యాక్టర్స్ అందరూ ఉండగా.. సిరీస్ లో అందరి కంటే ఎక్కువగా ఆకట్టుకున్న నటి చిన్నారి కశ్వి మజ్ముందర్. నాడియా అనే చిన్నారి పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజన్స్ సిరీస్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఓ చిన్నారి ఈస్థాయి షార్ప్ ఎక్స్ ప్రెషన్స్ & పర్ఫెక్షన్ తో నటించడం ఈమధ్యకాలంలో చూడలేదు.

సమంత తన నటనతో కంటే యాక్షన్ సీక్వెన్స్ లతో ఎక్కువగా అలరించింది. మేకప్ ఎందుకో కాస్త ఎబ్బెట్టుగా కనిపించింది. ముఖ్యంగా 90ల్లో ఆమె లుక్ అస్సలు సహజంగా లేదు. యాక్షన్ సీన్స్ లో మాత్రం ఇరగదీసింది. హీరో కంటే ఎక్కువ యాక్షన్ బ్లాక్స్ సమంతకు ఉండడం విశేషం. వరుణ్ ధావన్ ముఖంలో ఓ అమాయకత్వం ఉంటుంది. ఎన్ని ఫైట్లు చేసినా, ఎంత రొమాన్స్ చేసినా, ఎమోషనల్ సీన్స్ లో అతడి హావభావాలు భలే ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్ లోనూ అదే విధంగా ఎమోషన్స్ తో ఆకట్టుకున్నాడు వరుణ్.

కేకే మీనన్ కు ఈ తరహా పాత్ర కొట్టిన పిండి లాంటిది. ఇప్పటికే చాలాసార్లు ఈ తరహా పాత్ర పోషించి ఉండడంతో ఆయన పాత్ర పెద్దగా ఎగ్జైట్ చేయదు. ఇక మరో కీలకపాత్రలో సిమ్రాన్ అలరించింది. ఈ తరహా పాత్రల్లో ఆమెను చూసినప్పుడు నటిగా ఆమె పొటెన్షియల్ ను మన దర్శకులు సరిగా వినియోగించుకోలేదు అనిపిస్తుంది. షాకిబ్, సికందర్ ఖేర్, సోహం మజుందార్ తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: రాజ్ & డీకేల రైటింగ్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ లో ఎక్కడా అతి కనిపించదు. ఉదాహరణకు సినిమాలో బైక్ చేజ్ సీక్వెన్స్ లో ఓ లారీ అడ్డు రాగానే సమంత పాత్ర “కింద నుంచి స్కిడ్ అవ్వద్దు” అని చెబితే, వెంటనే వరుణ్ ధావన్ పాత్ర “ఏమైనా పిచ్చా?” అంటాడు. లాజిక్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేందుకు ఇది మంచి ఉదాహరణ. అలాగే.. ఎమోషన్స్ లోనూ ఎక్కడా అతి కనిపించదు. ముఖ్యంగా.. చిన్నారి నాడియా పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఓ స్ట్రాంగ్ & ఇండిపెండెంట్ ఉమెన్ పెంచిన పాప ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా ప్రాజెక్ట్ చేసారు. అలాగే.. అమెరికన్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా పాత్రకు లింక్ చేస్తూ ఈ నాడియా క్యారెక్టర్ ను బిల్డ్ చేసిన విధానం కూడా బాగుంది. ఇక యాక్షన్ బ్లాక్స్ ను కథలో భాగంగా డిజైన్ చేసిన విధానం సిరీస్ కి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది.

ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కి వస్తే.. చాలా చోట్ల “టెనెట్” సినిమాలోని మ్యూజిక్ ను తలపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా 1990, 2000 సంవత్సరాల నడుమ వ్యత్యాసం చూపించిన విధానం బాగుంది. అలాగే.. ఆర్ట్ డిపార్ట్మెంట్ & ప్రొడక్షన్ టీమ్ తీసుకున్న జాగ్రత్తలు కూడా సిరీస్ కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

విశ్లేషణ: హాలీవుడ్ రేంజ్ కంటెంట్ తో మన ఇండియన్ సినిమాలు/సిరీస్ లు చాలా అరుదుగా వస్తుంటాయి. “సిటాడెల్ హనీ బన్నీ” అందులో ఒకటి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వరుణ్ ధావన్ నటన, సమంత యాక్షన్ బ్లాక్స్, రాజ్ & డీకే లాజికల్ టేకింగ్ ఈ సిరీస్ కు ప్రధాన ఆకర్షణలు. అలాగే.. సిరీస్ ను అనవసరంగా సాగదీయకుండా 6 ఎపిసోడ్స్ లో ముగించడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కూర్చుని ఎక్కడా మ్యూట్ లేదా ఫార్వార్డ్ చేయాల్సిన అవసరం రాకుండా చూసే సౌలభ్యాన్ని ఈ సిరీస్ కలిగించింది. అందువల్ల.. హ్యాపీగా ఈ వీకెండ్ కి “సిటాడెల్ హనీ బన్నీ”నీ బింజ్ వాచ్ చేసేయండి.

ఫోకస్ పాయింట్: హాలీవుడ్ రేంజ్ గ్రిప్పింగ్ ఇండియన్ స్పై సిరీస్!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus