పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది అనే విషయం బయటకు వచ్చినప్పుడు ఎక్కడలేని సందడి, ఉత్సాహం సినీ వర్గాల్లో కనిపించింది. దానికి కారణం విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటన, పూరి జగన్నాథ్ టేకింగ్.. ఆ రెండింటి మిక్సింగ్. ఈలోపు సినిమా నేపథ్యం గురించి వచ్చిన వార్తలతో హైప్ బాగా పెరిగింది. సినిమాకు ‘స్లమ్ డాగ్’ అనే పేరు పెట్టినట్లు వార్తలు రావడంతో ఇంకా డబుల్ అయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతూ విజయ్ సేతుపతి చేసిన కొన్ని కామెంట్స్‌తో మరింత ఆసక్తి రేగింది.
‘స్లమ్ డాగ్’ సినిమా టీజర్‌ను ఇటీవల చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఈ సినిమా విడుదలయ్యే ప్రతి భాషలోనూ ప్రేక్షకులకు నచ్చుతుంది. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అత్యుత్తమమైన సినిమాల్లో ఇదొకటి అవుతుంది అన్నారు. అప్పుడే పూరితో తన తొలి కనెక్ట్ గురించి విజయ్ మాట్లాడారు. పూరి తీసిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా తమిళ రీమేక్ ‘ఎం.కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో విజయ్ సేతుపతి నటించారట.
జయం రవితో ‘ఎం.కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’ సినిమా చేయగా అందులో విజయ్ సేతుపతి జూనియర్ ఆర్టిస్ట్‌గా చేశారట. అలాంటి తాను ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా చేయడం ఆనందంగా ఉందంటూ నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు విజయ్ సేతుపతి. అలాగే హీరోగా తన జర్నీ ఎంత గొప్పగా సాగిందో కూడా చెప్పినట్లు అయింది. నిజమైన సంఘటనల స్ఫూర్తితో రూపొందిన సినిమా ‘స్లమ్ డాగ్’. ‘‘ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా..?’ అని హీరో అనడం సినిమా కాన్సెప్ట్. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.