కర్ణ పేరు వినగానే మనకి మహానటుడు నందమూరి తారకరామారావు నటించిన దాన వీర సూర కర్ణ సినిమా గుర్తుకు వస్తుంది. తెలుగు సినిమా తొలినాళ్లలో వచ్చిన ఈ చిత్రాన్ని మళ్ళీ తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అయితే పృధ్వీరాజ్ హీరోగా పెట్టి మలయాళ దర్శకుడు ఆర్‌ఎస్ విమల్ కర్ణ సినిమాని తీయాలని అనుకున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. కొన్ని కారణాలతో చిత్రీకరణ ఆగిపోయింది. ఆ కథ నచ్చడంతో విలక్షణ నటుడు విక్రమ్ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో యునైటెడ్ ఫిలిం కింగ్ సంస్థ నిర్మించడానికి ఓకే చెప్పింది. సో ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఏకకాలంలో హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిసింది.
2019 డిసెంబరులో రిలీజ్ చేయాలనీ డైరక్టర్ ఆర్‌ఎస్ విమల్ అనుకుంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “‘స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాం. గత రెండేళ్లలో ఎనిమిది సార్లు స్క్రిప్ట్‌ను తిరగరాశాను. ఇప్పుడు తొమ్మిదో సారి మార్పులు చేస్తున్నాను. ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. సినిమా విడుదలయ్యాక 2000 కోట్ల వసూళ్లు రాబట్టాలి. రెండేళ్ల క్రితమే ఈ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాను. తొలుత కర్ణుడి పాత్రలో పృథ్వీరాజ్‌ను ఎంపికచేసుకున్న మాట నిజమే. కానీ ఆయన ఆ సమయంలో “లూసిఫర్” అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అందుకే విక్రమ్‌ను ఎంపికచేశాను. బాలీవుడ్‌లో వచ్చిన “దంగల్” సినిమా ఎంత సక్సెస్ అయిందో “మహావీర కర్ణ” కూడా అంతే సక్సెస్ కావాలని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.