Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

Advertisement

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా ఓ పెద్ద చర్చ నడుస్తోంది. సిటీల్లో అందులోనూ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూసేవారికి ఇది పెద్ద విషయం కాదు కానీ.. సింగిల్‌ స్క్రీన్స్‌లో సినిమాలు చూసేవారికి మాత్రం ఇది పెద్ద విషయమే. ఎందుకంటే సింగిల్‌ స్క్రీన్స్‌లో సినిమాను అద్దె రూపంలో కాకుండా… పర్సంటేజీ పంపకం విధానం ద్వారానే సినిమాలు రిలీజ్‌ చేయాలని తద్వారా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని కాపాడాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ అడుగుతోంది. ఈ మేరకు నిర్మాతలు, కథానాయకుల్ని రిక్వెస్ట్‌ చేసింది.

Tollywood

అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించడం వల్ల థియేటర్ల యాజమాన్యాలకు నష్టాలు వస్తున్నాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అందుకే పర్సంటేజీ పంపకం విధానానికి ఒప్పుకోవాలని.. అప్పుడే సినిమాల్ని ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నామని ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. అందులో కొందరు నిర్మాతలు కూడా ఉండటం గమనార్హం. ఈ మేరకు ‘అంతరించిపోతున్న సినిమా హాళ్లని కాపాడండి’ అనే నినాదాన్ని పైకి తీసుకొచ్చారు ఎగ్జిబిటర్లు.

ఇది ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం. ఏ సినిమాను గానీ, ఏ నిర్మాతను గానీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన రాష్ట్రాల్లోని సింగిల్‌ స్క్రీన్‌ థియేట‌ర్లకు ప‌ర్సంటేజీ విధానం అమ‌లు చేస్తున్నట్లుగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా చేయాలి అనేదే తమ విన్నపం అని చెప్పారు ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్‌ శిరీష్‌. అలాగే థియేటర్లు బంద్ చేస్తున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. తాము థియేటర్లు బంద్ చేయడం లేదని కూడా ఎగ్జిబిటర్లు చెప్పుకొచ్చారు.

గీతా ఆర్ట్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్‌ ఇప్పటికే పర్సంటేజీ విధానంలోకి వచ్చాయని.. మిగిలిన వారు కూడా త్వరలో వస్తారని ఆశిస్తున్నామని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో కొత్త ఆలోచనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హీరోలు కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. మరెవరు మాట్లాడతారో చూడాలి.

ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus