ఒక సినిమాలో జరిగితే.. ఏదో అలా కథ మేరకు జరిగింది అనుకోవచ్చు. కానీ తీసిన రెండు సినిమాల్లోనూ అలానే జరిగితే కచ్చితంగా ఆ దర్శకుడికి అలాంటి అంశాల మీద ఆసక్తి ఉంది అనే అర్థం. అయితే ఆ దర్శకుడు ఆ మాటకు ఓకే అవ్వడం లేదు అనుకోండి. కానీ సినిమా ప్రేక్షకులు మాత్రం అదే మాట అంటున్నారు. ఆ కామన్ అంశం శరీరంలోని ఓ పార్ట్ తొలగించడం/ తొలగించుకోవడం కాగా.. ఆ దర్శకుడు బుచ్చిబాబు సానా. ‘పెద్ది’ సినిమా వచ్చాక ఇప్పుడు ఇదే టాపిక్ నడుస్తోంది.
ఇటీవల బుచ్చిబాబు సానా.. మీడియా ముందుకు వచ్చినప్పుడు రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ రెండూ కలిపి ఇప్పుడు ప్రశ్న సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అదే ‘బుచ్చిబాబు నెక్స్ట్ కటింగ్ మహేష్ బాబుకేనా?’. అంటే బుచ్చిబాబు కొత్త సినిమా మహేష్‌బాబుతోనేనా అని అర్థం. ‘తర్వాతి సినిమా మహేశ్‌తో చేస్తున్నారా’ అని బుచ్చిబాబును అడగ్గా, ‘అదేనండీ.. చర్చలు జరుగుతున్నాయి. ఇంకా టైమ్ పడుతుంది’ అని సమాధానమిచ్చారు. అంటే ఈ సినిమా అవకాశం ఉన్నట్లే.
మరి మహేష్‌బాబు సినిమాలోనూ ఏదైనా అవయవం కట్ చేస్తారా? అని అడగ్గా ‘అయ్యో అదేం లేదండీ.. కథలో వస్తే వస్తుంది’ అని నవ్వేశారు. బుచ్చిబాబు – మహేష్‌బాబుకు ‘వన్ నేనొక్కడినే’ సినిమా రోజుల నుండి పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే ఇప్పుడు కథ చెప్పి, తన సినిమా ఓకే చేయించుకోవాలని చూస్తున్నారని టాలీవుడ్ టాక్. మరి సుకుమార్ ఇవ్వని విజయాన్ని బుచ్చిబాబు ఇస్తారా అనేది చూడాలి.
ఇక ‘పెద్ది’ సినిమా గురించి చూస్తే.. జూన్ 3న ప్రీమియర్ షో, జూన్ 4న రిలీజ్‌తో మొదలైన ఈ సినిమా సందడి గత వారాంతంలో భారీగానే కనిపించింది. నాలుగు రోజులకుగాను రూ. 292.5 కోట్లు వసూళ్లు వచ్చాయి. దీంతో సోమవారం నుండి వచ్చే వసూళ్లే సినిమా ఫలితాన్ని తేలుస్తాయి.