తమిళ సినిమా నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో కొన్ని కీలక మార్పులు చేపట్టబోతోంది. ఇటీవల జరిగిన తమిళ్ సినిమా నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేశారు. భారీ బడ్జెట్ సినిమాల నటీనటులకు రెమ్యూరేషన్ల విషయంలో రెవెన్యూ షేరింగ్ మోడల్ అనుసరించాలని నిర్ణయించుకున్నారు. అంటే సినిమాకు వచ్చే వసూళ్ల బట్టి వారికి రెమ్యూనరేషన్ ఇవ్వనున్నరన్నమాట. అయితే దీనికి నటులు అంగీకరించాల్సి ఉంది. ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది కూడా.
ప్రస్తుతం తమిళ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు వారి లెక్కల ప్రకారం రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ డబ్బు ఇస్తున్నారు. అయితే నిర్మాతలు చెబుతున్న విధానంలో సినిమా లాభనష్టాలను నిర్మాతతో పాటు నటీనటులు కూడా పంచుకోవాల్సిందే. ఇక మే 2న టీఎఫ్‌పీసీ ఒక రోజు సమ్మెను ప్రకటించింది. రెవెన్యూ షేరింగ్ మోడల్ విషయంలో నడిగర్ సంఘం సహకారం అందించకపోతే, ఒక రోజు సమ్మె కాస్తా పూర్తి సమ్మె అవుతుందని కూడా చెబుతున్నారు.
ఇక థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత ఓటీటీలోకి రావడం విషయంలోనూ నిర్మాతలు కొన్ని ఆలోచనలు చేశారు. సినిమా విడుదలైన 6 నుండి 8 వారాల పాటు ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. మిడ్ రేంజ్ సినిమాలకు ఆరు వారాలు, భారీ సినిమాలకు 8 వారాలు అని నిర్ణయించారు. అయితే ఈ విధానం గురించి కొన్ని నెలల క్రితం టాలీవుడ్‌లోనూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒకట్రెండు సినిమాలకు తప్ప వేరే సినిమాలకు పాటించడం లేదు.
రెవెన్యూ షేరింగ్ ఆలోచననను టీఎఫ్‌పీసీ ప్రతిపాదించడం ఇదే తొలిసారి కాదు. 2025లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కూడా ఇలానే హీరోలకు విజ్ఞప్తి చేశారు. అయితే అప్పుడు స్పందన రాలేదు. మరిప్పుడైనా నటులు అనుకూలంగా స్పందిస్తారేమో చూడాలి. తెలుగులో అయితే కొంతమంది పెద్ద హీరోలు ఈ విధానంలోనే సినిమాలు చేస్తున్నారు.