ఒకప్పటి ఏడీ.. నేటి హీరో

సినిమా రంగంలో ఉంటే చాలు, అది ఏ పని అయినా పరవాలేదు అనుకునేవారు చాలా మంది. అందులో నేటి హీరోలు కూడా ఉన్నారు. తెరపైన స్టార్ గా మెరవక ముందు, తెర వెనుక మౌనంగా పని చేశారు. ప్రముఖ దర్శకుల వద్ద అసిస్టెంట్ గా శ్రమిస్తూ సినీ నిర్మాణ సంగతులు తెలుసుకున్నారు. వారి ప్రతిభకు, అదృష్టం తోడై నటులుగా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి ఛాన్స్ ని మెట్లుగా మలుచుకుని ఎదిగేందుకు పూర్వ అనుభవం పనికొచ్చింది. టాలీవుడ్ లో సహాయ దర్శకులుగా అడుగుపెట్టి కథానాయకులుగా ఎదిగిన వారి గురించి ఫోకస్.

రవితేజ

హీరో అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన కొత్తల్లో మాస్ మాహారాజ్ రవితేజ అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు. ప్రతిబంద్, ఆజ్ కా గుండా రాజ్, క్రిమినల్, నిన్నే పెళ్లాడుతా సినిమాలకు ఏడీగా హుషారుగా సెట్లో సందడి చేసేవారు.

ఉత్తేజ్

హాస్యనటుడిగా తెరమీద కనిపించక ముందు ఉత్తేజ్ అనేక సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ, రంగీలా వంటి చిత్రాలకు ఏడీగా భాద్యతలు నిర్వర్తించారు. వర్మ వద్ద 14 చిత్రాలకు సహాయదర్శకునిగా ఉత్తేజ్ పనిచేయడం విశేషం.

నాని

వరుస హిట్లతో దూసుకు పోతున్న నటుడు నాని. అష్టాచెమ్మా తో హీరోగా పరిచయం కాకముందు ఆరేళ్ల పాటు సహాయ దర్శకునిగా పనిచేశారు. బాపు “రాధా గోపాలం”, అల్లరి, ఢీ, అస్త్రం తదితర చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా క్లాప్ కొట్టారు.

సందీప్ కిషన్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు మేనల్లుడు అయినా సందీప్ కిషన్ హీరోగా కనపడక ముందు తమిళ దర్శ కుడు గౌతమ్ మీనన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీకి ఏడీగా చిత్రీకరణ సంగతులు తెలుసుకున్నారు.

నిఖిల్

పక్కా హైదరాబాదీ నిఖిల్ కాలేజీ చదివే రోజుల్లో స్నేహితులతో కలిసి “హైదరాబాదీ నవాబ్స్” సినిమా తీశారు. ఈ చిత్రంలో నటించడంతో పాటు సహాయ దర్శకుడిగా శ్రమించారు. ఇదంతా హ్యాపీ డేస్ సినిమా క్రితం జరిగిన సంగతి. ఇప్పుడు నిఖిల్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో.

కృష్ణుడు

భారీ శరీరం ఉన్నావినాయకుడు, విలేజిలో వినాయకుడు వంటి చిత్రాల్లో హీరోగా మెప్పించిన నటుడు కృష్ణుడు. మేకప్ వేసుకోక ముందు రసూల్ ఎల్లోర్ దర్శకత్వ బృందంలో ఒకరిగా పనిచేశారు. రవితేజ భగీరథ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా సినిమా మేకింగ్లో మెళుకువలు నేర్చుకున్నారు.

సిద్దార్ధ్

బాయ్స్, నువ్వువస్తానంటే వద్దంటానా వంటి చిత్రాలతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నసిద్దార్ధ్ కూడా ముందుగా తెర వెనుకే తర్ఫీదు పొందారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకునిగా పనిచేశారు. అమృత సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేశారు.

సునీల్

హీరోగా ప్రమోషన్ అందుకున్న హాస్యనటుడు సునీల్ కి సినిమా రంగం పై విపరీతమైన పిచ్చి. అందుకే 24 క్రాఫ్ట్స్ లో ఎక్కడ పని చేయమన్న ఆనందంగా అల్లుకు పోతారు. హాస్య నటుడిగా కనిపించక ముందు “పేరు లేని సినిమా (పాపే నా ప్రాణం), సెకండ్ హ్యాండ్ చిత్రాలకు ఏడీగా పనిచేశారు.

కమల్ కామ రాజు

గోదావరి, ఆవకాయ్ బిర్యాని సినిమాలో హ్యాండ్ సమ్ గా ఆకట్టుకున్న నటుడు కమల్ కామరాజు. ఇతనికి పెయింటింగ్ లో మంచి ప్రావీణ్యం ఉంది. అదే అతనిని సినిమా రంగానికి పరిచయం చేసింది. అనుకోకుండా ఒక రోజు మూవీ కి ఆర్ట్ డైరక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేశారు.

శ్రీనివాస్ అవసరాల

నటన కంటే దర్శకత్వమే శ్రీనివాస్ అవసరాలకి ఇష్టం. అందుకే అతను విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ చేశారు. నటుడిగా కనిపించక మునుపు బ్లైండ్ యాంబిషన్ మూవీకి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు.

సప్తగిరి

ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా ఎదుగుతోన్న సప్తగిరి కెరీర్ తొలినాళ్లలో డైరక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేశారు. భాస్కర్ దర్శ కత్వంలో వచ్చిన పరుగు సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేశారు.

రాజ్ తరుణ్

జోరు మీదున్న హీరో రాజ్ తరుణ్.. సినిమా రంగంలోకి అసిస్టెంట్ డైరక్టర్ గానే అడుగు పెట్టారు. ఎన్నో షార్ట్ ఫిల్మ్ లకు దర్శకత్వం వహించిన రాజ్ ఉయ్యాల జంపాల మూవీకి ప్రీ ప్రొడక్షన్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా శ్రమించారు. అనూహ్య పరిమాణాలతో నటుడిగా అవతారమెత్తారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus