చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!

తెలుగు హీరోలకు సంక్రాంతి ప్రత్యేక పండుగ. ఆ పెద్ద పండుగనాడు తమ సినిమాలతో బరిలోకి దిగుతారు. పోటీ నీదా.. నాదా.. అంటూ సవాల్ విసురుతారు. ఈ ఆనవాయితీ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఉంది. రెండో తరం హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య కొన్నేళ్లుగా పోటీ కొనసాగింది. ఒక సారి మెగాస్టార్ మూవీ హిట్ కొడితే మరో సారీ బాలయ్య ప్రతాపం చూపించేవారు.

ఇప్పటి వరకు కేవలం పెద్ద పండుగనాడు మాత్రమే 8 సార్లు, ఇతర సందర్భాల్లో ఐదు సార్లు ఈ స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగాయి. చివరి సారి వీరిద్దరూ 2017 లో తల పడ్డారు. ఈ సందర్భంగా పెద్దపండుగతో పాటు మిగిలిన రోజుల్లో పోటీ పడిన చిరు, బాలయ్య చిత్రాలపై ఫోకస్..

మంగమ్మగారి మనవడు – ఇంటిగుట్టు

బాలకృష్ణ, చిరంజీవికి భారీగా అభిమానసంఘాలు ఏర్పడుతున్న రోజులవి. 1984 సంవత్సరం లో తొమ్మిదో నెలలో ఇద్దరూ తమ చిత్రాలతో బరిలోకి దిగారు. మూడవ తేదీన మంగమ్మగారి మనవడు చిత్రంతో బాలకృష్ణ రాగా, మూడు రోజుల తర్వాత ఇంటి గుట్టుతో చిరంజీవి వచ్చారు. ఈ రెండింటిలో సుహాసిని ప్రధాన కథానాయికగా నటించింది. మంగమ్మగారి మనవడు మాత్రం సూపర్ హిట్ అయి ఆమెకు మంచి పేరుతెచ్చి పెట్టింది.

కథానాయకుడు – రుస్తుం

1984 లోనే రెండో సారి యుద్ధంలోకి దిగారు. డిసెంబర్ 14 న బాలయ్య కథానాయకుడి చిత్రం రిలీజ్ కాగా వారం తర్వాత 21 వ తేదీన చిరు రుస్తుం విడుదలయింది. ఈ చిత్రంలో యాక్షన్ తో మెగాస్టార్ అదరగొట్టారు. హిట్ అందుకున్నారు. కథానాయకుడు పేరులో బలమున్నప్పటికీ సినిమాలో లేకుండా పోయింది.

ఆత్మబలం – చట్టంతో పోరాటం

1984 లో చిరంజీవి చిత్రాలు పది రిలీజ్ అయ్యాయి. 1985 లో 8 చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో చట్టంతో పోరాటం సంక్రాంతికి రిలీజ్ అయి బాలయ్య ఆత్మబలం మూవీకి గట్టి పోటీ ఇచ్చింది.

నిప్పులాంటి మనిషి – కొండవీటి రాజా

1986 లో స్టార్ హీరోలు రెండు సార్లు తలపడ్డారు. జనవరి 31 న కొండవీటి రాజా గా చిరు వచ్చి విజయ దుందుభి మోగించగా, వారం తర్వాత ఫిబ్రవరి 7 న నిప్పులాంటి మనిషి గా వచ్చి బాలకృష్ణ పోటీలో వెనుక పడ్డారు.

అపూర్వ సహోదరులు – రాక్షసుడు

1986 లో పదవ నెలలో మరో సారి యుద్దానికి దిగారు. చిరంజీవి 02 తేదీ రాక్షసుడిగా ముందు వచ్చి కమర్షియల్ హీరో అనిపించుకున్నారు. వారం తర్వాత అపూర్వ సహోదరులు అంటూ వచ్చిన బాలయ్య ఆకట్టుకోలేకపోయారు. రాక్షసుడు మూవీ మెగాస్టార్ కెరీర్ ని మలుపుతిప్పింది.

భార్గవ రాముడు – దొంగ మొగుడు

చిరంజీవి హవా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 1987లో సంక్రాంతికి మూడు రోజుల ముందుగానే వచ్చిన దొంగ మొగుడు సూపర్ హిట్ అయింది. జనవరి 14 న బాలకృష్ణ భార్గవ రాముడు మూవీ రిలీజ్ అయి విజయం అందుకోలేకపోయింది.

రాము – పసివాడి ప్రాణం

1987లో రెండోసారి బాలయ్య, చిరుతో పోటీకి దిగారు. జులై 23 పసివాడి ప్రాణం, 31 రాము చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రెండూ హిట్ సాధించాయి. పసివాడి ప్రాణం మాత్రం చిరు స్థాయిని మరింత పెంచింది.

ఇన్ స్పెక్టర్ ప్రతాప్ – మంచిదొంగ

1988 సంక్రాంతి హీరోగా చిరంజీవి పేరు సంపాదించుకున్నారు. జనవరి 14 న మంచిదొంగ, 15 న ఇన్ స్పెక్టర్ ప్రతాప్ విడుదలయ్యాయి. ఇందులో మంచిదొంగ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

రాముడు భీముడు – యుద్దభూమి

1988 మొదట్లో అపజయాన్ని చవిచూసిన బాలయ్య చివర్లో పై చేయి సాధించారు. నవంబర్ 11 వచ్చిన యుద్దభూమి అంచనాలను అందుకోలేక పోయింది. వారం తర్వాత వచ్చిన రాముడు భీముడు హిట్ అందుకుంది.

పెద్దన్నయ్య – హిట్లర్

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వార్ మొదలయింది. 1997 జనవరిలో ఇద్దరి చిత్రాలు తల పడ్డాయి. 4 వ తేదీన హిట్లర్, 10 వ తేదీన పెద్దన్నయ్య రిలీజ్ అయింది. రెండింటిని ప్రజలు ఆదరించారు. హిట్ చేశారు.

వంశోద్ధారకుడు – అన్నయ్య

2000 వ సంవత్సరం చిరంజీవి వశమైంది. సంక్రాంతిని పురస్కరించుకొని 7 వ తేదీన వచ్చిన అన్నయ్య సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఎన్నో అంచనాలతో 14 వ తేదీన విడుదలయిన వంశోద్ధారకుడు మాత్రం బోల్తా కొట్టింది.

నరసింహ నాయుడు – మృగరాజు

2001 లో బాలకృష్ణ, చిరుపై ప్రతీకారం తీర్చుకున్నారు. జనవరి 11న చిరు మృగరాజుగా రంగంలోకి దిగగా, బాలయ్య నరసింహ నాయుడిగా తొడగొట్టారు. బాలకృష్ణ చిత్రం సూపర్ హిట్ అయింది. నరసింహ నాయుడు టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.

భలేవాడివి బాసు – శ్రీ మంజునాథ

2001 లో రెండో సారి ఇద్దరు బరిలోకి దిగారు. జూన్ 15 భలేవాడివి బాసు అంటూ బాలయ్య రాగా, 22 న శ్రీ మంజునాథ అనే భక్తి చిత్రం తో చిరు వచ్చారు. ఈ సారి చిరు కాస్త ఎక్కువ మార్కులతో పాసయ్యారు. బాలకృష్ణ మాత్రం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేక పోయారు.

లక్ష్మీ నరసింహ – అంజి

2004 లో చిరు, బాలయ్య చివరి సారి పోటీ పడ్డారు. జనవరి 14 న లక్ష్మీ నరసింహ, 15 అంజి రిలీజ్ అయ్యాయి. పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ లక్ష్మీ నరసింహలో అద్భుతంగా నటించి కలక్షన్ల వర్షం కురిపించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన అంజి నిర్మాతకు నష్టాలను మిగిల్చింది.

గౌతమి పుత్ర శాతకర్ణి – ఖైదీ నంబర్ 150

చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో వీరిద్దరి చిత్రాలు క్లాష్ కాలేదు. మళ్ళీ మదమూడేళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు తల పడ్డాయి. 2017 సంక్రాంతికి చిరు ఖైదీ నంబర్ 150, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి గా చిత్రాలు వోచాయి. రెండూ హిట్ సాధించాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus