తమిళ సినిమా పరిశ్రమలోకి వెళ్లాలి.. అక్కడా తామెంటో చూపించాలి అని చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాతో తొలి అడుగు వేసింది కూడా. అయితే పెద్ద హీరోతో కోలీవుడ్‌లో సినిమా చేయాలనే ప్రయత్నం మాత్రం అలానే ఉంది. ఇప్పుడు ఈ ప్రయత్నం ఫలించింది అని చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ ఓకే చేసుకుందట. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు అని సమాచారం.
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. వాటిలో అల్లు అర్జున్ – అట్లీ సినిమా పాన్ ఇండియా సినిమా కాగా.. మిగిలిన ఏడు సినిమాలు తెలుగు సినిమాలే. అందులో రెండు చిన్న సినిమాలు (జెట్‌లీ, 418) ఉండగా.. మిగిలిన ఐదు పెద్ద హీరోల సినిమాలు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో మూడు సినిమాలు రానున్నాయి. ఇవి కూడా పెద్ద హీరోల సినిమాలే.
చాలా రోజులు మైత్రీ మూవీ మేకర్స్ తమిళ హీరోలతో చర్చలు జరపగా.. ఇప్పుడు సూర్య, శింబు, శివకార్తికేయన్ డేట్స్ సంపాదించారట. వీరి సినిమాలకు దర్శకులు ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది. తెలుగు దర్శకులే ఈ సినిమాలను హ్యాండిల్ చేస్తారా? లేక తమిళ దర్శకులను తీసుకొస్తారా అనేది చూడాలి. మైత్రీ వారు బాలీవుడ్‌కి వెళ్లినప్పుడు తెలుగు దర్శకుడితోనే ట్రై చేశారు. కాబట్టి ఇప్పుడు తెలుగు దర్శకులతోనే ఉండొచ్చని సమాచారం.
మైత్రీ పెద్ద హీరోల సినిమాల విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ప్రభాస్ – హను రాఘవపూడి ‘ఫౌజీ’, విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాన్ ‘రణబాలి’, తారక్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’, రవితేజ – శివ నిర్వాణ ‘ఇరుముడి’, అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఉన్నాయి.