ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని వారాల క్రితం మొదలైన ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. తొలుత కథ గురించి, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ లుక్ గురించి, ఇప్పుడు రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతోంది. దానికి కారణం ఈ సినిమా కోసం సల్మాన్ తన రెమ్యూనరేషన్ సగానికి తగ్గించుకోవడానికి సిద్ధమయ్యాడు అనేది తాజా సమాచారం.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో దిల్ రాజు బాలీవుడ్‌లో సోలో ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమాకు భారీగానే ఖర్చు పెడుతున్నారని, ఈ క్రమంలో రెమ్యూనరేషన్లు భారీగా ఉంటాయని వార్తలొచ్చాయి. అలా సల్మాన్ ఖాన్ సాధారణంగా తీసుకునే రూ.120 కోట్లు రెమ్యునరేషన్ ఈ సినిమాకు తీసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమా కోసం సల్లూ భాయ్ రూ.70 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఎందుకంత తగ్గించేశాడు అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ విషయం దిల్ రాజు దగ్గర ప్రస్తావనకు వస్తే.. సల్మాన్ ఖాన్ పారితోషికంపై వస్తున్న వార్తలు అవాస్తవం. నిర్మాతలుగా మేము మా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార వివరాలను ఎప్పుడూ బహిర్గతం చేయం. సినిమా బడ్జెట్, పారితోషికాలపై వస్తున్న వివరాలు ఊహాగానాలు మాత్రమే అని తేల్చేశారు. ఈ లెక్కన ఎంతిస్తున్నారు అనేది తేలలేదు. ఇక ఈ సినిమా కోసం తాను 16 కిలోలు తగ్గినట్లు సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు.
ఇక ఈ సినిమాను సల్మాన్‌కు బాగా కలిసొచ్చే రంజాన్ సందర్భంగా 2027లో విడుదల చేస్తారు. ఇందులో సల్మాన్‌కు జోడీగా అగ్ర కథనాయిక నయనతార నటిస్తుండగా.. సీనియర్ నటుడు అరవింద్ స్వామి మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఓ ఇంటర్నేషనల్ మూవీకి ఫ్రీమేక్ లాంటిది అని అంటున్నారు. గతంలో వంశీ పైడిపల్లి ఇలాంటి ఫ్రీమేక్‌లు బాగానే చేసిన విషయం తెలిసిందే.