కొన్ని సున్నితమైన ప్రేమ కథలు ఉంటాయి. వాటిని ఎంత డీటెయిల్డ్‌గా చూస్తే అన్ని అదనపు వివరాలు తెలుస్తాయి. అలాగే సినిమా ఇలా కూడా తీయొచ్చా? ఇన్ని విషయాలు అంతర్లీనంగా చెప్పొచ్చా అని కూడా అనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ‘96’ (96 Movie) ఒకటి. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) , త్రిష (Trisha) కాంబినేషన్‌లో సి.ప్రేమ్ కుమార్ తమిళంలో తెరకెక్కించిన చిత్రమిది. తెలుగులో సమంత (Samantha) – శర్వానంద్ (Sharwanand) కలసి ‘జాను’ (Jaanu) అని చేశారుగా అదే. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ‘96’ సినిమాకు సీక్వెల్ తీస్తానని దర్శకుడు ప్రకటించారు కాబట్టి.
2018లో విడుదలైన ‘96’ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలున్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆరేళ్లు ఎక్కడా ఆ చర్చ మళ్లీ రాలేదు. అయితే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ప్రేమ్ కుమార్ దగ్గర ఆ విషయం ప్రస్తావిస్తే ‘96’కి సీక్వెల్ ఉందని స్పష్టం చేశారు. ‘96’ సినిమాకు సీక్వెల్ చేయాలని తొలుత అనుకోలేదు అని, అయితే ఆ చిత్రానికి దక్కిన ప్రేక్షకాదరణే కొనసాగింపు సినిమాకు తీయాలనుకోవడానికి ప్రేరణ అని చెప్పారు.
అంతేకాదు ఆ సినిమా స్క్రిప్టు పూర్తయిందని.. విజయ్ సేతుపతి, త్రిష డేట్స్ దొరికితే సినిమా ప్రారంభిస్తా అని కూడా చెప్పారు. అయితే ఇక్కడే మెలిక ఉంది. త్రిష, విజయ్ సేతుపతి డేట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమే. ‘మహారాజ’ సినిమాతో ఇటీవల హిట్ కొట్టిన విజయ్ సేతుపతి ‘విడుదలై 2’, ‘ఏస్’, ‘గాంధీ టాక్స్’ తదితర చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు, ‘బిగ్‌బాస్ 8’ తమిళ షోకి హోస్ట్‌గా చేస్తున్నాడు.
మరోవైపు త్రిష ‘విశ్వంభర’ (Vishwambhara) , ‘థగ్ లైఫ్’ (Thug Life), ‘రామ్’, ‘ఐడెంటిటీ’ తదితర సినిమాల్లో బిజీగా ఉంది. మరోవైపు ఇలాంటి క్లాసిక్స్ సినిమాలను అలా వదిలేస్తేనే మంచిదని.. బలవంతంగా కథను సాగదీసి సీక్వెల్స్ తీస్తే ప్రేక్షకులకు నచ్చదు అనే వాదనా వినిపిస్తోంది. మరి ప్రేమ్ కుమార్ సీక్వెల్ ప్రయత్నం ఎంతమేర ఫలిస్తుందో చూడాలి.