మిస్టరీ థ్రిల్లర్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది మలయాళం ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ నుంచి మే నెలలో వచ్చిన తాజా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ “తలవన్” (Thalavan) . బిజు మీనన్ (Biju Menon) & ఆసిఫ్ అలీ (Asif Ali) ప్రధాన పాత్రధారులుగా జిస్ జోయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈవారం సోనీ లైవ్ లో విడుదలైంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులోకి రావడంతో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పట్లానే క్యూ కట్టేశారు. సో, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: జయశంకర్ (బిజు మీనన్) & కార్తీక్ వాసుదేవన్ (ఆసిఫ్ అలీ) ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు. వాళ్ల సిన్సియారిటీకి ఈగో కూడా యాడ్ అవ్వడంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూనే తమ సీనియారిటీ ప్రూవ్ చేసుకోవడం కోసం ఒకరిపై ఒకరు లేనిపోని పంతాలు పెట్టుకుని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో జయశంకర్ ఇంట్లో రమ్య (అనుశ్రీ) శవం దొరకడం పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా ప్రభుత్వం కార్తీక్ వాసుదేవన్ ను నియమిస్తుంది.
ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రొఫెషనల్ ఇష్యూస్ కేస్ ఇన్వెస్టిగేషన్ పై ఏమైనా ఎఫెక్ట్ చూపించాయా? అసలు రమ్య ఎవరు? జయశంకర్ ను ఇరికించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? వంటి ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానమే “తలవన్” చిత్రం.
నటీనటుల పనితీరు: తెలుగులో ఇదివరకు “రణం(Ranam) , ఖతర్నాక్” చిత్రాల ద్వారా మనకి పరిచయస్తుడైన బిజు మీనన్ ఈ సినిమాలో కాస్త ఈగో ఉన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. అతడి క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎక్కడా తగ్గలేదు. ఒకే ఫ్లో మైంటైన్ చేయడం మంచి ప్లేస్ పాయింట్ గా నిలిచింది. మరో నటుడు ఆసిఫ్ అలీ పాత్ర కూడా బిజు మీనన్ పాత్రకి పోటీగా ఉన్నప్పటికీ.. అతడి పాత్రలో కాస్త మంచితనం యాడ్ చేసి ఇంకాస్త నీట్ గా ఎలివేట్ చేసారు. సహాయ పాత్రలో మియా జార్జ్ (Miya George) పర్వాలేదనిపించుకోగా.. కథను మలుపు తిప్పే రమ్య పాత్రలో అనుశ్రీ ఆకట్టుకుంది. ఇక మిగతా మలయాళ ఆర్టిస్టులు ఎప్పట్లానే తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు జిస్ జోయ్ “తలవన్” కథను రాసుకున్న విధానం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. నిజంగానే క్లైమాక్స్ కి వచ్చే వరకు ఎవరు దొంగ, ఎవరు విలన్ అనే విషయం ఎవ్వరూ గెస్ చేయలేరు. అందువల్ల ప్రేక్షకులు చివరి వరకు సినిమాలో లీనమై, ట్విస్ట్ ఎప్పడు రివీల్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కథనం అంత పక్కాగా రాసుకున్నాడు దర్శకుడు. అలాగే.. వేసిన ఒక్కో చిక్కుముడిని విప్పిన విధానం కూడా బాగుంది.
దీపక్ దేవ్ సంగీతం, శరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్ గా నిలిచాయి. యాక్షన్ బ్లాక్స్ అండ్ నైట్ షాట్స్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. అలాగే దీపక్ దేవ్ తనదైన శైలి నేపథ్య సంగీతంతో ప్రేక్షకుడు సినిమాలో లీనమయ్యేలా చేసిన విధానం కూడా బాగుంది.
విశ్లేషణ: మర్డర్ మిస్టరీ అనగానే పొలోమని క్యారెక్టర్స్ ను ఇన్వాల్వ్ చేసేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించేసే సినిమాలే ఎక్కువగా చూసాం ఇప్పటివరకు. కానీ.. “తలవన్” (Thalavan) అలా కాకుండా చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ తో చివరి వరకు సినిమాలో ట్విస్ట్ రివీల్ అవ్వకుండా చాలా పకడ్బందీగా రాసుకున్న విధానం బాగుంది. సోనీలైవ్ యాప్ లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమ్ అవుతుంది కాబట్టి.. ఈ వీకెండ్ కి మంచి టైమ్ పాస్ ఈ “తలవన్”.
ఫోకస్ పాయింట్: మలయాళం నుండి వచ్చిన మరో మంచి థ్రిల్లర్!
రేటింగ్: 3/5