యువ కథానాయకుడు రాజ్ తరుణ్ (Raj Tarun) నటించిన తాజా చిత్రం “భలే ఉన్నాడే” (Bhale Unnade) . సెన్సిబుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. “గీతా సుబ్రమణ్యం, పెళ్లిగోల 2” వంటి వెబ్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు శివ సాయి వర్ధన్ (J Sivasai Vardhan) మొట్టమొదటి ఫీచర్ ఫిలిం ఇది. మరి దర్శకుడు/నిర్మాత/రచయిత అయిన మారుతి అందించిన ఈ మొదటి అవకాశాన్ని అతడు ఏమేరకు సద్వినియోగపరుచుకున్నారు? సినిమా ఎలా ఉంది? అనేది చూద్దాం..!!
కథ: స్ట్రాంగ్ & ఇండిపెండెంట్ ఉమెన్ అయిన గౌరీ (అభిరామి (Abhirami) పెంపకంలో తండ్రి లేకుండా పెరిగిన చక్కని కుర్రాడు రాధ (రాజ్ తరుణ్). తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంట్లో అన్నీ పనులు చేస్తూ.. వైజాగ్ లోన్ ఏకైక సారి డ్రేపర్ గా మంచి పేరు తెచ్చుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అదే సమయంలో అతడికి పరిచయమవుతుంది కృష్ణ (మనీషా కందుకూర్ (Manisha Kandkur ). ఇద్దరు మొదట ఒకర్నొకరు చూసుకోకుండా ఇష్టపడి, అనంతరం చూసుకుని ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు.
సరిగ్గా అదే సమయానికి కృష్ణకు రాధలో మగతనం ఉందో లేదో అనే అనుమానం తలెత్తుతుంది. ఆ అనుమానాన్ని ఎవరితోనూ పంచుకోకుండా నిజం అని నమ్మేసి పెళ్లి దాకా వెళ్లాల్సిన బంధాన్ని పెటాకులు చేసుకుంటుంది. మరి ఈ జంట ప్రయాణం అక్కడితో ముగిసినట్లేనా? అసలు కృష్ణ ఆ విధంగా రాధ గురించి అనుకోవడానికి కారణం ఏమిటి? చివరికి ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “భలే ఉన్నాడే” (Bhale Unnade Review) చిత్రం.
నటీనటుల పనితీరు: చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ ఒక వైవిధ్యమైన పాత్రలో సహజంగా ఒదిగిపోయి నటించాడు. ఓవరాల్ గా మంచి బరువైన పాత్రను చాలా హుందాగా పండించాడు. ముఖ్యంగా ఎక్కడా కూడా అతి లేదా చిరాకు తెప్పించకుండా చాలా బ్యాలెన్స్ తో రాధ పాత్రను పండించిన తీరు అభిందనీయం. రాజ్ తరుణ్ తర్వాత తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి అభిరామి. తల్లి పాత్రలో చాలా ఒద్దికగా నటించింది. ఆమె పోషించిన పాత్రకు ఉన్న వెయిటేజ్ ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది.
ఇక లుక్స్ విషయానికి వస్తే హీరోయిన్ కంటే అందంగా కనిపించి ఆశ్చర్యపరిచింది అభిరామి. కన్నడ బ్యూటీ మనీషా కందుకూర్ కి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ.. ఎక్కడా బెరుకు అనేది లేకుండా చాలా చక్కగా కృష్ణ అనే పాత్రలో ఒదిగిపోయింది. చూడ్డానికి కాస్త తమన్నా ఫేస్ కట్స్ ఉండడం ఆమెకు ప్లస్ పాయింట్. నటిగానూ తొలి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకోవడం అనేది కూడా మెచ్చుకోవాల్సిన విషయం.
విటివి గణేష్ (VTV Ganesh) తనదైన పెక్యులర్ వాయిస్ తో కాస్త నవ్వించగా.. సినిమా మొత్తానికి పెద్ద మైనస్ ఆ సీక్వెన్స్. ఇక సీనియర్లు సింగీతం శ్రీనివాసరావు (singeetam srinivasa rao) మరియు లీలా శాంసన్ లు ఈ వయసులోనూ చక్కగా నటిస్తూ సినిమా పట్ల తమకు ఉన్న ప్యాషన్ ను చాటుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: నగేష్ బానెల్ (Nagesh Banell) సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. అదే విధంగా శేఖర్ చంద్ర (Shekar Chandra) సంగీతం కూడా వినసొంపుగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ విషయంలో పెద్దగా లోపాలు ఏమీ కనిపించలేదు. దర్శకుడు శివ సాయి వర్ధన్ ఒక మంచి పాయింట్ ను ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకోవాలి. సినిమాలో ఎక్కడా ఇబ్బందిపడే కామెడీ కానీ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ లేకుండా తెరకెక్కించిన విధానం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమాను దగ్గర చేస్తుంది. రచయితగా కంటే దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు శివ సాయి వర్ధన్.
విశ్లేషణ: ఒక ఎమోషనల్ పాయింట్ కు మంచి జస్టిఫికేషన్ లేకపోతే ఆడియన్స్ ఆ సినిమాతో లేదా సినిమాలోని పాత్రలో ట్రావెల్ చేయలేరు. “భలే ఉన్నాడే” సినిమా అసభ్యతకు తావు లేకుండా మంచి సెన్సిబుల్ అంశాన్ని అంతే సెన్సిబుల్ గా చూపించారు. “భలే ఉన్నాడే” మరో వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది.
రేటింగ్: 2.5/5