Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’
- August 5, 2026 / 03:37 PM ISTByPhani Kumar
నందమూరి బాలకృష్ణ తిరుగులేని మాస్ హీరో. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. బాలయ్య సినిమాకు పోటీగా వేరొక సినిమా.. మరీ ముఖ్యంగా చిన్న సినిమాను విడుదల చేయడానికి బయ్యర్లు వెనకడుగు వేస్తారు. ఇప్పుడే ఈ స్థాయిలో క్రేజ్ ఉంటే.. ఇక బాలయ్య ప్రైమ్ టైమ్‌లో అది ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Top Hero

అయితే, 1994లో బాలయ్యకు, ఆయన అభిమానులకు ఓ చిన్న సినిమా ఊహించని షాక్ ఇచ్చింది. అదే ‘ఆమె’. 1994 డిసెంబర్ 9న బాలయ్య నటించిన ‘టాప్ హీరో'(Top Hero) సినిమా విడుదలైంది. ‘యమలీల’, ‘శుభలగ్నం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. అందులోనూ ‘బొబ్బిలి సింహం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
కానీ, ఆ భారీ అంచనాలను అందుకోవడంలో ‘టాప్ హీరో’ చతికిలపడింది. సరిగ్గా అదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమా ‘ఆమె’ అఖండ విజయాన్ని సాధించింది. వెంకటేష్‌తో ‘అబ్బాయిగారు’, నాగార్జునతో ‘హలో బ్రదర్’ వంటి బంపర్ హిట్స్ కొట్టిన తర్వాత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చేసిన చిన్న సినిమా ఇది. కేవలం ఈవీవీ గారి బ్రాండ్ ఇమేజ్‌పై నమ్మకంతోనే బయ్యర్లు ‘ఆమె’ సినిమాను కొనుగోలు చేశారు.
ఊహించని విధంగా ‘టాప్ హీరో’కు నెగిటివ్ టాక్ రావడం.. ‘ఆమె’కు పాజిటివ్ టాక్ రావడంతో అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మొత్తంగా చూసుకుంటే.. ‘టాప్ హీరో’ మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, లాంగ్ రన్‌లో నిలబడలేకపోయింది. మరోవైపు ‘ఆమె’ సినిమాకు రెండో రోజు నుంచే వసూళ్లు విపరీతంగా పెరిగాయి. దర్శకులు కేవలం స్టార్ హీరోల ఇమేజ్ మీదే కాకుండా కంటెంట్ మీద నమ్మకంతో సినిమాలు తీయాలనడానికి.. ఈ రెండు చిత్రాల ఫలితాలే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు!














