‘చిన్నారి పెళ్ళి కూతురు’ అనే హిందీ డబ్బింగ్ సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికాగోర్… ఆ తరువాత ‘ఉయ్యాల జంపాల’ అనే చిత్రంతో మరింత దగ్గరయ్యింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడం.. ఆ తరువాత వచ్చిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అలాగే ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాలు కూడా బాగా ఆడడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. అయితే అటు తరువాత ఈమె బరువు పెరగడంతో దర్శకనిర్మాతలు ఈమెను పక్కన పెడుతూ వచ్చారు. దాంతో కొన్నాళ్ళు వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యి.. ‘రాజు గారి గది 3’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ చిత్రం కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. మొన్నటికి మొన్న బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి షాకిచ్చిన అవికా.. ఇప్పుడు నిర్మాతగా కూడా మారబోతున్నట్టు ప్రకటించి మరింత షాక్ కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. ‘నెపోలియన్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాని రూపొందించిన నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లితో కలిసి అవికా గోర్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యిందట. ‘ఆచార్య క్రియేషన్స్’, ‘అవికా స్క్రీన్ క్రియేషన్స్’ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి రోవర్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం. మురళీ నాగ శ్రీనివాస్ గంధం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో అవికా మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుండీ నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇక్కడ ప్రతి అంశాన్ని చాలా శ్రద్దగా గమనించాను. అన్ని విషయాల పైనా అవగాహన ఉండటం వలనే… ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యాను. మురళీ నాగ శ్రీనివాస్ గారు నాకు ఈ కథను వినిపించగానే బాగా నచ్చింది. నిర్మాతగా మారేందుకు ఈ సినిమా అయితేనే బాగుంటుంది అనిపించింది. వెంటనే నేను కూడా ప్రొడక్షన్లో భాగమవుతానని ఆయనకి చెప్పాను. ‘ఆచార్య క్రియేషన్స్’ ‘అవికా స్క్రీన్ క్రియేషన్స్’ మధ్య ఈ చిత్రంతో మంచి బాండింగ్ ఏర్పడుతుందని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.