బాడీ షేమింగ్ కారణంగా తన కెరీర్ లో చాలా సార్లు ట్రోలింగ్ కి గురయ్యానని చెబుతోంది నటి హన్సిక. ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గినప్పటికీ కోలీవుడ్ లో మాత్రం రాణిస్తోంది ఈ బ్యూటీ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 18 ఏళ్లు దాటినా..
ఆమెకి ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు హన్సిక నటించిన ‘మహా’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో హన్సిక మాజీ బాయ్ ఫ్రెండ్ శింబు కూడా నటించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హన్సిక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది హన్సిక. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే సమయంలో తనపై జరిగిన బాడీ షేమింగ్ ట్రోల్స్ గురించి మాట్లాడింది.
కెరీర్ ఆరంభంలో ఈ ట్రోల్స్ వలన ఇబ్బందులు పడ్డానని చెప్పింది హన్సిక. అయితే పాజిటివ్ యాటిట్యూడ్ తో ట్రోల్స్ ను ధైర్యంగా ఎదుర్కోవడం మొదలుపెట్టానని చెప్పింది. తన బాడీ ఎలా ఉండాలనేది తన చేతిలోనే ఉంటుందని.. ఇతరుల ఆలోచనలకు, అభిప్రాయాలకు తగ్గట్లుగా ఉండాలని ప్రయత్నించడంతో అర్ధం లేదనే విషయాన్ని మెల్లగా అర్ధం చేసుకున్నానని చెప్పుకొచ్చింది హన్సిక.
అలానే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను కూడా పెద్దగా పట్టించుకోనని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శృతి’ వంటి సినిమాల్లో నటిస్తోంది.