సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు సైబర్ పోలీసులు ఎన్ని ప్రకటనలు చేసి హెచ్చరించినా ఇంకా కొంతమంది అత్యాశకు పోయి వాళ్లకి చిక్కుతున్నారు. సామాన్యులు మాత్రమే కాదు ఈ లిస్ట్ లో సెలెబ్రిటీలు కూడా ఉండడం షాక్ ఇచ్చే అంశం. తాజాగా ఓ నటి సైబర్ నేరగాళ్ల వల్ల చిత్ర హింసలు పడుతుంది. అంతేకాదు ఈమె ఫోటోలు మార్ఫింగ్ చేసి.. చాలా అసభ్యకరంగా మార్చి వేధింపులకు గురిచేస్తున్నారట. మానసికంగా ఈమెను డిస్టర్బ్ చేసి డబ్బులు గుంజడమే పనిగా పెట్టుకున్నారని ఆ నటి ఓ వీడియో ద్వారా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళ సీరియల్ నటి లక్ష్మీ వాసుదేవన్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా తెలియజేసింది. లక్ష్మీ వాసుదేవన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నా వాట్సాప్‌లో ఉన్న వారందరికీ.. అలాగే ప్రేక్షకులకు ఈ మెసేజ్ చెప్పాలని భావించి ఈ వీడియో చేయడం జరిగింది. నా ఫొటోలను ఎవరో మార్ఫింగ్ చేసి,మరీ ముఖ్యంగా అసభ్యకరంగా చేసి నా వాట్సాప్‌లో ఉన్న వారందరికి ఓ కొత్త నెంబర్ నుండి పంపుతున్నారు. ఇది ఎందుకు? ఎక్కడ మొదలైందో? ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను.
నాలా ఎవ్వరూ మోసపోకూడదు అనే ఉద్దేశంతో ఇది చెబుతున్నాను. సెప్టెంబర్ 11న నాకు ఒక మెసేజ్ వచ్చింది. అందులో నాకు రూ.5 లక్షల రూపాయల వరకు లక్కీ డ్రా మనీ వచ్చినట్లు ఉంది. అత్యాశకు పోయి నేను ఆ లింక్‌ను క్లిక్ చేశాను. అప్పుడు ఓ యాప్ నా మొబైల్ లో ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయింది. ఆ యాప్ డౌన్లోడ్ అయిన కాసేపటికే నా ఫోన్ హ్యాక్ అయ్యింది. తర్వాత నేను ఆ సంగతి మర్చిపోయాను.కొన్నిరోజుల తర్వాత నాకు కొన్ని మెసేజ్‌లు రావడం స్టార్ట్ అయ్యాయి . మీరు లోన్ తీసుకున్నారు.. ఐదు వేల రూపాయల లోన్ తీసుకున్నారు.
ఆ లోన్ కట్టలేదు అంటూ ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు వస్తున్నాయి. అందులో బూతులు తిడుతూ వేధిస్తున్నారు. 5 వేల లోన్ కట్టకపోతే మీ మార్ఫింగ్ ఫొటోలు అందరికీ పంపుతామని బెదిరిస్తున్నారు. దీంతో నేను హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.అయితే నా మార్ఫింగ్ ఫోటోలు నా స్నేహితులకు, తల్లిదండ్రులకు, అలా నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ వెళ్లాయి. తప్పుడు యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఈరోజు నేను అనుభవిస్తున్నాను. నాలా ఎవ్వరూ అలా మోసపోవద్దని నా మనవి” అంటూ ఏడ్చేసింది ఈ నటి.