జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సదా.. అనంతరం అనేక హిట్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. శంకర్ మూవీ అపరిచితుడు లోను విక్రమ్ కి జోడీగా కనిపించి తమిళ ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా చేసుకుంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో పోటీ వలన ఆమె వెనక్కి తగ్గినా.. అటు టీవీ షోలతోను.. ఇటు చిన్న చిత్రాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది. తాజాగా టార్చ్‌లైట్ అనే తమిళ చిత్రంలో నటించడానికి ఒకే చెప్పింది. గతంలో విజయ్ హీరోగా తమిళన్ చిత్రాన్ని తెరకెక్కించిన మజీద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. “టార్చ్‌లైట్ మహిళావగాహన కథా చిత్రంగా ఉంటుంది.
పేదరికం కారణంగా వ్యభిచార వృత్తిలోకి దిగే స్త్రీల జీవితాన్ని ఆవిష్కరించనున్నాం” అని డైరక్టర్ మజీద్ తెలిపారు. ఈ చిత్రంలో నటించడానికి పలువురు ప్రముఖ నటీమణులు నిరాకరించారని, అలాంటి పాత్రను చేయడానికి నటి సదా ధైర్యంగా ముందుకొచ్చారని వెల్లడించారు. టార్చ్‌లైట్ సదా కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. సదా పైన డైరక్టర్ అభినందనలు కురిపించినట్టే.. డైరక్టర్ పై సదా ప్రశంసలు కురిపించింది. మజీద్ కథ మలిచిన విధానం అద్భుతంగా ఉందని.. అందుకే అతని తర్వాతి చిత్రాన్ని తానే నిర్మిస్తున్నట్టు సదా స్పష్టం చేసింది. మరి నిర్మాతగా సదా ఎంతమేర విజయం సాధిస్తారో త్వరలోనే తెలియనుంది.