బాలీవుడ్‌లో తెరకెక్కిన భారీ సినిమాల్లో కొన్ని అవకాశాలు నటుల కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తాయి. కానీ అదే అవకాశాలు కొన్నిసార్లు టైమింగ్, కమిట్‌మెంట్స్ కారణంగా చేజారిపోతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. సంచలన విజయాన్ని అందుకున్న ధురంధర్ సినిమాలోని ఓ కీలక పాత్రకు తొలుత దర్శకుడు ఆదిత్య ధర్ తెలుగులో ఒక సీనియర్ హీరోను సంప్రదించినట్టు సమాచారం. ఆ నటుడు ఎవరో చూసేద్దాం రండి.
సాధారణంగా దర్శకులు కథ రాస్తున్నప్పుడే కొన్ని పాత్రలను నిర్దిష్ట నటులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. ధురంధర్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాలోని పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ కోసం ఆదిత్య ధర్ ముందుగా హీరో అక్కినేని నాగార్జునకు కథ వినిపించారట. కథ, పాత్ర డిజైన్ రెండూ నాగార్జునకు బాగా నచ్చాయని టాక్ . అయితే అదే సమయంలో ఆయన ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు.
ఒకవైపు రజినీకాంత్ హీరోగా రూపొందిన ‘కూలీ’లో కీలక పాత్ర, మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తుండటంతో డేట్స్ సమస్య ఎదురైంది. రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి జరగడం వల్ల ధురంధర్‌కు సమయం కేటాయించలేక నాగార్జున ఆ ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ పాత్రను బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా చేయగా, అది ఆయన కెరీర్‌లోనే మరో మైలురాయిగా మారింది. రణవీర్‌కు సమానంగా అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరిశారు.
డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తూ వెయ్యి కోట్ల మార్క్‌ను దాటి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా చూసిన తర్వాత “ఈ పాత్ర నాగార్జున చేసి ఉంటే ఎలా ఉండేదో” అనే చర్చ అభిమానుల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొన్ని అవకాశాలు అలా… దగ్గరికి వచ్చి, టైమింగ్ తేడాతో దూరమైపోతుంటాయి.