పొరుగు రాష్ట్రాల నుండి తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చే భామామణుల భాష తిప్పలు తెలిసిందే. “అందరికీ నమస్కారం” మినహా అన్నీ వారికి వచ్చిన భాషలో కానిచ్చేసి పనైందనిపిస్తారు. ఒకరిద్దరు ఇందుకు మినహాయింపు అనుకోండి. అయితే కేరళలో పుట్టి ముంబైలో పెరిగిన అదాశర్మ వంటి ముద్దుగుమ్మలైతే. పాపం ఏ భాషలో మాట్లాడాలో తెలీక ఎన్ని అవస్థలు పడతారో..? తొలి సినిమా ‘హార్ట్ ఎటాక్’ మొదలు ఈ సంవత్సరం విడుదలై అదాశర్మకు తొలి విజయం అందించిన ‘క్షణం’ వరకు మొత్తంగా అయిదు సినిమాలు చేసిన ఈ చిన్నదాని నోట త్వరలో తెలుగు పలుకులు వినబడనున్నాయి.
ఆ మేరకు అదా సన్నద్ధమవుతోందట. ఇదేదో తెలుగు సినిమా కోసం అయితే కానే కాదు. హిందీ సినిమా ‘కమాండో 2’ కోసం. విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అదాశర్మ విజయవాడ అమ్మాయిగా కనపడనుంది. అంచేత తెలుగు మాట్లాడటం తప్పనిసరి. దీనికోసం అదా పట్టుబట్టి మరీ తెలుగు పాఠాలు నేర్చుకుంటుందట. తెలుగులో అయిదు సినిమాల్లో నటించినా ‘మాట’ విషయంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు పనిచెప్పిన ఈ సుందరి హిందీలో మాత్రం ఈ సాహసానికి ఎందుకు ఒడిగట్టినట్టు? బహుశా బాలీవుడ్ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యానని కాబోలు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.