చేసినవి మూడు సినిమాలు.. మూడుకు మూడు బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితాలే ఎదుర్కొన్నాయి. అయినా ఆ స్టార్ హీరో కుమార్తె డైరక్టర్ ఆశలు ఇంకా తీరడం లేదు. ఇప్పుడు ఏకంగా ఐదు భాషల్లో సినిమా చేస్తూ పాన్ ఇండియా ఆలోచనలు చేశారు. ఆమెనే రజనీకాంత్ కుమార్తెల్లో ఒకరైన ఐశ్వర్య రజనీకాంత్. ఇప్పుడు ఆమె కొత్త సినిమాను తాజాగా అనౌన్స్ చేశారు. కన్నా రవి గ్రూప్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
హీరో, హీరోయిన్, సాంకేతిక నిపుణుల వివరాలేవీ వెల్లడించకపోయినా ఈ సినిమా స్టార్ హీరోతోనే ఉంటుంది అని కోడంబాక్కం వర్గాల సమాచారం. గత సినిమాల తరహాలో ప్రయోగాత్మకంగా పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాను ఐశ్వర్య రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈసారి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాం అని టీమ్ ప్రకటించింది.
ఐశ్వర్య రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే.. 14 ఏళ్ల క్రితం ‘3’ అనే సినిమాతో దర్శకురాలుగా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమాకు బాక్సాఫీసు దగ్గర సరైన స్పందిన రాకపోయినా ‘కొలవెరి’ పాట మాట సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఆ తర్వాత రీరిలీజ్‌ల్లో ఆ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఆ వెంటనే ‘వాయ్ రాజా వాయ్’ అనే సినిమా చేశారు. ఆ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి.
ఆ తర్వాత 9 ఏళ్లకు అంటే 2024లో ‘లాల్ సలామ్’ అనే సినిమా చేశారు. ఆ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో కూడా నటించారు. అయితే సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఇప్పట్లో ఐశ్వర్య మళ్లీ మెగాఫోన్ పట్టుకునే పరిస్థితి లేదు అని అనుకున్నారంతా. కానీ రెండేళ్లు నిండకుండానే ఆమె మరోసారి డైరక్టర్ కుర్చీలో కూర్చోబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితం తీసుకొస్తుందో చూడాలి.