ఒకప్పుడు అల్లు అరవింద్ బ్యానర్‌లో సినిమాల నిర్మాణ బాధ్యతలు చూస్తూ వచ్చారు యువ నిర్మాత బన్ని వాస్. కొన్ని చిన్న ప్రాజెక్ట్‌లను అల్లు అరవింద్ వద్దకు బన్ని వాస్ తీసుకొచ్చేవారని వినికిడి. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద రూపొందిన సినిమాల్లో కొన్ని అలాంటివే. అయితే ఆయన అనుకున్న ప్రాజెక్టులను వెళ్లడానికి అల్లు అరవింద్ ఓకే చెప్పలేదో, లేక బయటకు వచ్చి చేద్దాం అనుకున్నారో ఏమో.. బన్ని వాస్ ఆ బ్యానర్ నుండి తాత్కాలికంగా బయటకు వచ్చేశారు.
ఇదంతా జరుగుతున్న సమయంలో ఓసారి అల్లు అరవింద్ సినిమా నిర్మాణం స్టైల్ గురించి ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఓ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ వల్ల తర్వాత గీతా ఆర్ట్స్‌లో చాలా చర్చ జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని బన్ని వాస్ కూడా చూఛాయగా ఒప్పేసుకున్నారు. ఆ రోజు బండ్ల గణేశ్ అన్న మాటను, అల్లు అరవింద్ చేస్తున్నారు అని చెప్పిన పనిని ఇప్పుడు బన్ని వాస్ ఘనంగా చేస్తున్నారు అనిపిస్తోంది. దానికి కారణం ఆయన నిర్మాతగా వస్తున్న సినిమాలే.
‘లిటిల్ హార్ట్స్’ నుండి ఇప్పుడు ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని’ సినిమా వరకు బన్ని వాసు, వంశీ నందిపాటి కలసి నిర్మిస్తున్నవే. ఇక్కడ నిర్మిస్తున్నవి అనలేం కానీ.. ఇతరులు నిర్మిస్తున్న వాటిని చివారఖరులో వచ్చి నిర్మాతగా మారి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని’ సినిమాకు రిలీజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇతర నిర్మాణ సంస్థలు మంచి క్వాలిటీతో సినిమాలు తీస్తున్నారని, వాళ్లు ఎంతో కష్టపడి తీసిన సినిమాలను తాను చివర్లో టేకప్ చేసి రిలీజ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నానని బన్నీ వాసు అన్నారు. ఇంచుమించుగా ఇదే మాటను కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్‌ను ఉద్దేశించి బండ్ల గణేశ్ అన్నారు. అంటే అప్పుడు ఆయన.. ఇప్పుడు బన్ని వాస్ అదే పని చేస్తున్నారనేగా?