ఈ రోజుల్లో హిట్ సినిమాకు సీక్వెల్ చేస్తాం అంటే.. ‘మాకొద్దు దొర.. నమ్మకం లేదు దొరా..’ అని అభిమానులు కంగారు పడేలా పరిస్థితులు ఉన్నాయి. రెండు ముక్కలు చేసి సినిమాను రిలీజ్ చేయడం వరకు ఓకే కానీ.. సినిమాకు సీక్వెల్ మాత్రం వద్దు అని అంటున్నారు. ఇతర పరిశ్రమల్లో ఏమో కానీ.. టాలీవుడ్‌లో అయితే ఇలా సీక్వెల్‌లాగా లేదంటే పాత కథను/ పాత్రలను పోలిన కథతో సినిమా అంటే మాత్రం అభిమానులు, ప్రేక్షకులు భయపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితులు ఉన్న టాలీవుడ్‌లో ఓ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తా అంటున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన.. బయట మీడియాతో మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తానని చెప్పారు. తన అనవాయితీ ప్రకారం ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఆ కథేంటి, సినిమా ఏంటి అనే వివరాలు ఆయన కాస్త కూడా వెల్లడించలేదు. తెలుగేతర హీరోతో ఆ సినిమా ఉంటుందని సమాచారం.
ఈ విషయాలు చెప్పిన తర్వాత.. బోయపాటి ఆసక్తికరమైన కామెంట్స్‌చేశారు. బాలకృష్ణతో ‘అఖండ 3’ సినిమా కూడా ఉంటుందని చెప్పారు. ఆ సినిమా గురించి సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. అంతేకాదు అవకాశం లభిస్తే చిరంజీవి, బాలకృష్ణతో మల్టీ స్టారర్ తీస్తానని కూడా చెప్పారు. ఆ మధ్య ఓ కార్యక్రమంలో చిరంజీవి నేరుగా బోయపాటికి ఈ సవాలు విసిరిన విషయం తెలిసిందే.
బాలకృష్ణను చక్కగా హ్యాండిల్ చేయగలరు అనే పేరున్న బోయపాటి శ్రీను.. ‘అఖండ 2’ సినిమా విషయంలో ఇబ్బందిపడ్డారు. కొన్ని సన్నివేశాలు అవుటాఫ్ ది బాక్స్ ఉండటం, ఇంకొన్ని నవ్వులాటలా మారిపోవడంతో సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడి సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఆయన వచ్చి ‘అఖండ 3’ సినిమా అంటే బాలయ్య ఏమంటారో చూడాలి. ఇక మల్టీస్టారర్ అంటే అంత ఈజీ కాదు. ఇద్దరు స్టార్‌లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు కదా.