ఇండస్ట్రీలో ప్రతీదీ బిజినెస్ వ్యవహారాలతో ముడిపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయం ఎవ్వరికీ తెలీనిది కాదు. అందులోనూ బిజినెస్ మైండ్సెట్ కలిగిన సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాత వద్ద పనిచేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ కి(Tharun Bhascker).. అస్సలు తెలీనిది కాదు. కానీ మొదటి నుండీ ఇతను కమర్షియల్ బాట పట్టిన వ్యక్తి కాదు. ‘పెళ్ళిచూపులు’ వంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత.. కొత్త వాళ్ళతో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిన్న సినిమా తీశాడు తప్ప పెద్ద స్టార్ కోసం టైమ్ వేస్ట్ చేసుకోలేదు.
వెంకటేష్ వంటి అగ్ర హీరోతో పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ, ఎన్నో సార్లు సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. అస్సలు పెద్ద ప్రాజెక్టుని సెట్ చేసుకోలేదు. నటుడిగా వరుస సినిమాల్లో నటిస్తూ.. సాఫీగా జీవనం కొనసాగిస్తూ వచ్చాడు. ‘కీడా కోలా’ ఫలితం తేడా కొట్టినా కమర్షియల్ గా అది బయ్యర్స్ ను ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ‘ఈఎన్ఈ రిపీట్’ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లను కొల్లగొట్టనుంది.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈరోజు జరిగిన ‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ మీట్లో తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.’గతంలో తాను డబ్బు వెనుక పరిగెత్తొద్దని చెప్పినప్పటికీ, ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా రూట్ మార్చాల్సిన సమయం వచ్చిందని, తక్కువ అంచనా వేసిన వారందరికీ సమాధానం చెప్పాలంటే ఇకపై కమర్షియల్ సక్సెస్ లక్ష్యమని, కేవలం ఒకే వర్గానికి పరిమితం కాకుండా, A, B, C సెంటర్స్ ప్రేక్షకులను మెప్పించే సినిమాలతో సత్తా చాటతానని,
అవకాశాల కోసం ఎవరి కాళ్ళ మీదో పడి బతిమాలే ప్రసక్తే లేదని, నటన మరియు దర్శకత్వంపై పూర్తి శ్రద్ధ పెట్టి, సినిమా ద్వారానే సమానత్వాన్ని చూపిస్తానన్న ఆత్మవిశ్వాసం నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుందని’ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. తరుణ్ భాస్కర్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. బహుశా తన పార్ట్నర్ ‘ఈషా రెబ్బా’ సలహాలు, సూచనల మేరకు తరుణ్ తన పంధా మార్చుకుని ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.