‘ప్రతిరోజూ పండగే’ లాంటి సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు మారుతి.. తన తదుపరి సినిమాను మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు. ప్రాజెక్ట్ సెట్ కాకపోవడం, కరోనా కారణంగా ఆయనకి అనుకోకుండా బ్రేక్ వచ్చేసింది. రవితేజతో సినిమా దాదాపు కన్ఫర్మ్ అనుకుంటే.. ఆ ఛాన్స్ మిస్ అయింది. దీంతో మారుతి.. గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇలాంటి సమయంలో దర్శకుడు మారుతిని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడట రవితేజ.
కథ సిద్ధం చేసుకోమని చెప్పాడట. దీంతో ‘పక్కా కమర్షియల్’ సినిమా పూర్తయిన వెంటనే రవితేజతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మారుతి. నిజానికి రవితేజ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నాడు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత మరో రెండు ప్రాజెక్ట్ లు లైన్లో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసేద్దామని రవితేజ అనుకుంటున్నాడు.
వచ్చే ఏడాదిలో మారుతి సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ‘పక్కా కమర్షియల్’ షూటింగ్ పూర్తయిన వెంటనే రవితేజకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టనున్నాడు మారుతి. మొత్తానికి క్యాన్సిల్ అనుకున్న ఈ కాంబోని తెరపై చూసే అవకాశం వస్తుందన్నమాట!