పాతికేళ్ల క్రితం వచ్చిన శివ సినిమాలో అమల అద్భుతంగా డ్యాన్స్ వేసింది. మళ్లీ ఇప్పుడు డ్యాన్స్ చేసింది. అయితే ఆ డ్యాన్స్ ని చూసి ఆనందించే అవకాశం నాగార్జునకు మాత్రమే దక్కింది. ఆ విషయాన్నీ స్వయంగా నాగార్జున చెప్పారు. “ఈ మధ్య కాలంలో డ్యాన్సులు చేయడం మర్చిపోయిన అమల ‘హలో’ చూసిన తర్వాత నా చుట్టూ తిరుగుతూ డ్యాన్సు వేసింది. ఆ దృశ్యం చూసి నాకు కడుపు నిండిపోయింది. అఖిల్ అమ్మమ్మకి తెలుగు రాకపోయినా ఇప్పటికి మూడు సార్లు సినిమా చూశారు’’ అని నాగార్జున ఆనందంతో చెప్పారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటించిన హలో మూవీ నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించిన నాగార్జున మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర సంగతులు వెల్లడించారు. “చిరంజీవిగారు సినిమా చూసిన తర్వాత మాట్లాడిన తీరు చూసి, నామీద ఉన్న బరువు దిగినట్టు అనిపించింది. ‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాలు నాకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టాయో, ఈ చిత్రం అఖిల్‌కు అలాంటి చిత్రమవుతుంది.
అందరూ ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. నిజంగా తన మీద ప్రేమతోనే ఇంత ఖర్చుపెట్టి సినిమా చేశాం. అఖిల్ న్యూ ఏజ్ బోయ్. తన నుంచి అందరూ కొత్తదనాన్ని కోరుకుంటారు. తను బేసిగ్గా అథ్లెట్. ఆ అంశాన్ని వాడుకుని విక్రమ్ ఇందులో యాక్షన్ సన్నివేశాలను మరింత బాగా తీశారు. మంచి ప్రేమకథలో యాక్షన్ సీక్వెన్స్ మరింత అందంగా ఒదిగిపోయాయి.ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు పాత్రలకు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు” అని నాగ్ తెలిపారు. హలో మూవీ తర్వాత అఖిల్ సినిమా ఏమిటని ఇంకా అనుకోలేదని నాగ్ స్పష్టం చేశారు.