“బిగ్ బి ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయలు” అనే వార్త బయటకొచ్చేసరికి ఆయనకు దిష్టి తగిలిందో లేక మరో కారణమో తెలియదు కానీ.. సడన్ గా ఆయన హెల్త్ అప్సెట్ అయ్యింది. ఇదంతా ఆయన జోధ్ పూర్ లో “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” షూటింగ్ లో బిజీగా ఉండగా జరిగిన విషయం. దాంతో షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. బిగ్ బీ మాత్రం కేవలం తన ఒక్కడి కారణంగా అంత మంది ఆర్టిస్ట్స్ ఇబ్బందిపడడమే కాక షూటింగ్ షెడ్యూల్స్ కూడా మారడం ఇష్టం లేక ట్రీట్ మెంట్ కోసం తాను ముంబై వెళ్లకుండా డాక్టర్లనే షూటింగ్ జరుపుకొంటున్న జోధ్ పూర్ కి రప్పించాడు.
అక్కడే రెండ్రోజులపాటు ట్రీట్ మెంట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడు. నిజానికి అమితాబ్ కి అంత అవసరం లేదు. సింపుల్ గా షూటింగ్ నుంచి వెళ్లిపోవచ్చు. కానీ సినిమా శ్రేయస్సు కోసం తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టినతీరు అందర్నీ విశేషంగా అలరించింది. అమీర్ ఖాన్ కూడా చేతులెత్తి నమస్కరించాడట.
అమీర్ ఖాన్, అమితాబ్ తోపాటు కత్రినా కైఫ్, ఫాతిమా శానా షేక్, జాకీ ష్రాఫ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. యష్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.