మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే భారీ సినిమాలో నటిస్తున్నాడు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాతో పాటు కొత్త దర్శకుడు శరత్ మండవతో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు రవితేజ. ఈరోజు నుండే శరత్ తన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ సినిమాకి ‘ఎమ్మార్వో’ అనే టైటిల్ ను పెట్టాలని అనుకుంటున్నారట.
ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తారని.. అందుకే ఈ టైటిల్ యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో ఎర్రచందనం రవాణా లాంటి వ్యవహారాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం. నిజానికి ‘ఖిలాడి’ సినిమా తరువాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు రవితేజ. కానీ స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు చేయాల్సి రావడంతో రవితేజ.. శరత్ మండవ సినిమాను మొదలుపెట్టారు.