“అర్జున్ రెడ్డి, ద్వారక, గీత గోవిందం, డియర్ కామ్రేడ్” ఇలా నటించిన ప్రతి సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉండేలా జాగ్రత్తపడుతూ ఆల్రెడీ “టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ” అనిపించుకుంటున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ త్వరలోనే “దొరసాని” అనే చిత్రంతో టాలీవుడ్ కి తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. జీవిత రాజశేఖర్ ల చిన్న కుమార్తె శివాత్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. 1970-80 నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ ఓ పాలేరు పాత్ర పోషిస్తుండగా.. శివాత్మిక ఓ జాగీరుకి చెందిన రాణీగా కనిపించనుంది.
ఇటీవల ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ టీజర్ లో ఆనంద్ దేవరకొండ-శివాత్మికల నడుమ ఓ ఘాటు అధర చుంబనం ఉండబోతోందట. టీజర్ మొత్తానికి అదే హైలైట్ అవ్వబోతోందని టాక్. సొ, డియర్ కామ్రేడ్ టీజర్ లో అన్నయ్య విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మండన్నాను ముద్దాడి చేసిన రచ్చను తమ్ముడు ఆనంద్ దేవరకొండ “దొరసాని” టీజర్ లో శివాత్మికను ముద్దాడి రీక్రియేట్ చేయనున్నాడన్నమాట. చూడాలి మరి ఈ వార్తలో నిజమెంత అనేది.